Begin typing your search above and press return to search.

ఏది పుణ్యం... ఏది పాపం ?

ఆ ఆత్రంలో ఆరాటంలో రద్దీలో బీభత్సమైన తొక్కిసలాట జరిగి చాలా మంది ఉసురు పోతోంది.

By:  Tupaki Desk   |   9 Jan 2025 7:51 AM GMT
ఏది పుణ్యం... ఏది పాపం ?
X

అవును పుణ్యానికి పాపానికి మధ్య తేడా ఏంటి. గీత ఎక్కడ. విభజన చేసేది ఎవరు అసలు పుణ్యాత్ములకు మంచి జరుగుతుందని చెబుతున్నది ఎవరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదంతా వేదాంతం. అయితే ఈ వేదాంతానికి ఒక దారి ఉంది అదే ఆధ్యాత్మిక మార్గం. దాని కోసమే గుళ్ళూ గోపురాలు ఉండేవి.

అక్కడకు పోతే పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తారు అది కూడా పుణ్య దినాలలో వెళ్తే ఇంకా బోలెడు పుణ్యం దక్కుతుందని ఆశిస్తారు. అలా పండుగ దినాలలో ఇతర విశేషాలలో అక్కడికి వెళ్ళే భక్తులకు పుణ్యానికి బదులు నరకం కనిపిస్తోంది. ఆ మీదట వారి అదృష్టం బాగుంటే తిరిగి వస్తున్నారు. లేకుండా అటు నుంచి అటే పరలోకానికి ప్రయాణ కట్టేస్తున్నారు.

తిరుపతిలో టోకెన్ల జారీ కోసం వందల వేల సంఖ్యలో భక్తులు క్యూ లైన్లు కడుతున్నారు. వారిని ఒక చోట ఉంచి ఒక్కసారిగా గేట్లు తీస్తున్నారు. ఆ ఆత్రంలో ఆరాటంలో రద్దీలో బీభత్సమైన తొక్కిసలాట జరిగి చాలా మంది ఉసురు పోతోంది. అలా ఉసురుపోతున్న వారంతా పుణ్యం కోసం వచ్చిన వారే. మరి వారు ఏమి పాపం చేశారని ఈ అకాల మరణాలు ఈ అర్ధాంతరపు చావులు అంటే జవాబు చెప్పేవారు ఎవరు.

ఎక్కడికి వెళ్ళినా మన ప్రాణాలకు గ్యారంటీ ఉందా అని అనుకోవాల్సిన రోజులకు అంతా వచ్చేశారు. మరీ ముఖ్యంగా రద్దీ ప్రాంతాలకు వెళ్ళినపుడు ఎవరి భద్రత వారే చూసుకోవాలి సుమీ అని ఇటీవల జరుగుతున్న సంఘటలు రుజువు చేస్తున్నాయి. ఇవి గతంలోనూ జరిగాయి ఇపుడు వరసబెట్టి జరుగుతున్నాయి కాబట్టే ఈ చర్చ.

అపుడేపుడో పుష్కరాలకు తొలి రోజే అదే ముహూర్తంలో స్నానం చేస్తే పుణ్యం అన్నారట పెద్దలు. అంతే పోలోమని వేలాది జనం వెళ్లారు. అందులో తొక్కిసలాట జరిగి ఏకంగా 29 మంది మరణించారు. దాని తరువాత నాయకుల రాజకీయ సభలలోనూ ఇదే రకంగా తొక్కిసలాటలు మరణాలు. మరి ఇదంతా ఎందుకు ఎవరి కోసం దేనికి అని ఆలోచించుకోకుండా మళ్లీ ఇలాగే జరుగుతూ పోవడంతో ఈ పాపం ఎవరిది అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

ఎవరినీ ఇంటి నుంచి ఎవరూ తీసుకుపోవడం లేదు. వారికి వారే వెళ్తున్నారు. అంటే ఆ విధంగా వారి బుద్ధిపూర్వకంగా వెళుతున్నారు కాబట్టి జాగ్రత్తలు పాటించడంలో వారిదే బాధ్యత అని ఒక వాదన ఉంది. అలా కాదు వారు వెళ్ళే చోటున సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలేదు కాబట్టి ఇలా జరుగుతోంది కాబట్టి నిర్వాహకులదే తప్పు అన్నది మరో వాదన.

నిజానికి ఇవన్నీ నిజాలే. అలాగే పూర్తి స్థాయి నిజాలా అంటే పాక్షికంగానే అని చెప్పాలి. ఎందుకంటే రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు. అలా అక్కడ కార్యక్రమం ఉంది కాబట్టి వీరు వెళ్తున్నారు. ఇక వీరు వచ్చిన చోటున సరైన ఏర్పాట్లు చేయలేదు కాబట్టే తొక్కిసలాట. అందువల్ల రెండు వైపులా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

ఇక తిరుపతిలో అన్నీ ఆన్ లైన్ చేసిన వారు ఈ టోకెన్లను మాత్రం ఎందుకు చేయడం లేదు అన్న ప్రశ్న వస్తోంది. అలా చేస్తే ఈ క్యూ లైన్లూ తొక్కిసలాటలు చావులు ఇవన్నీ తప్పుతాయి కదా అని అంటున్నారు. ఏడు కొండల వాడు కోట్లకు అధిపతి. అక్కడ వేలల్లో సిబ్బంది ఉన్నారు. అక్కడ భద్రత విషయంలో పొరపాట్లు జరగకుండా చూసుకోలేరా అంటే అవును చూసుకోవాలి. కానీ ప్రతీ రోజూ జరిగిన తంతే కదా అని అలసత్వం, నిర్లక్ష్యం ఉంటాయి. ఇలాంటి ఉదాశీనత తోనే నిండు ప్రాణాలు పోతూంటాయి.

పోయిన ప్రాణానికి నష్ట పరిహారం ఎటూ ఉంటుంది అని కూడా భావిచేవారూ ఉన్నారు. ఏది ఏమైనా ఒక ప్రాణం పోగొట్టే హక్కు ఎవరికీ లేదు ఆఖరుకు ఆ ప్రాణికి కూడా లేదు. ఈ విషయంలో అంతా ఆలోచించుకోవాలి. పాపాల భైరవుడికి ఒకరిని వెతికి సంఘటనకు బాధ్యులను చేసి చేతులు దులుపుకోవడం కాదు అసలు ఇలాంటివి ఫ్యూచర్ లో జరగకుండా ఏమి చేయాలో ఆలోచించాలి. పుణ్యాలు పాపాల అకౌంట్లు ఆ పరమాత్ముడు చూసుకుంటాడు కానీ ఆయన పేరు మీద హోదాలు అనుభవిస్తూ బుగ్గ కార్లలో తిరిగేవారు అంతరాత్మను నమ్ముకుని పనిచేస్తే అన్నీ బాగుంటాయి.