ఉగాది వేళ తిరుమల శ్రీవారికి ప్రత్యేక కార్యక్రమాలెన్నో.. అవేమంటే?
ఉగాది పర్వదినాన్ని తెలుగోళ్లు ఎలా జరుపుకుంటారన్న విషయం అందరికి తెలిసిన ముచ్చటే. తిరుమల శ్రీవారికి సైతం ఉగాదిని ప్రత్యేకంగా జరుపుతారు
By: Tupaki Desk | 30 March 2025 4:15 AMఉగాది పర్వదినాన్ని తెలుగోళ్లు ఎలా జరుపుకుంటారన్న విషయం అందరికి తెలిసిన ముచ్చటే. తిరుమల శ్రీవారికి సైతం ఉగాదిని ప్రత్యేకంగా జరుపుతారు. శ్రీవారి ఆలయంలో జరిగే ఈ వేడుకను ‘ఉగాది ఆస్థానం’ అని పిలుస్తారు. స్వామివారికి ఉగాది ప్రత్యేకత ఏమంటే.. ఈ రోజు నుంచే ఉత్సవాలు.. ఊరేగింపులు ఆరంభమై.. మళ్లీ ఉగాది నాటికి పూర్తి అవుతాయి. అంటే.. స్వామి వారి ఉత్సవాల సైకిల్ ఆరంభం అయ్యేది ఉగాది రోజు నుంచే. ఉగాది రోజున తిరుమలలో ఉగాది కొలువు లేదంటే వేంకటేశుడి ఉగాది దర్బార్ గా అభివర్ణిస్తారు.
కొత్త సంవత్సరం తొలిరోజును స్వామివారికి ఆర్చకులు ఆరు పట్టువస్త్రాల్ని సమర్పిస్తారు. అందులో నాలుగు మూలమూర్తికి... అంటే ఒకటి కిరీటానికి.. రెండోది నందక ఖడ్గానికి.. మూడోదాన్ని ఆది తోమాలగా.. నాలుగోదాన్ని ఉత్తరీయంగా అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాల్లో ఒకటి ఉత్సవమూర్తి మలయప్ప స్వామి వారికి.. రెండోదాన్ని విష్వక్సేనులకు అలంకరిస్తారు. అనంతరం ఉగాది ఆస్థాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
ఉగాది రోజున శ్రీవారి పాదాలపై ఉంచిన నూతన సంవత్సర పంచాంగాన్ని ఆస్థాన సిద్ధాంతి స్వామి వారికి భక్తితో చదివి వినిపిస్తారు. ప్రత్యేకంగా శ్రీనివాసుడి జన్మనక్షత్రమైన శ్రవణం ఫలితాల్ని వివరిస్తారు. అదే సమయంలో శ్రీదేవి - భూదేవిలకు వారి నక్షత్రాలైన ఉత్తర ఫల్గుణి.. రేవతీ నక్షత్రాల ఫలితాల్ని వినిపిస్తారు. తర్వాత అనాటి తిథి.. వార నక్షత్రాలతో పాటుగా నూతన సంవత్సర ఫలితాలు.. లాభనష్టాలు..నవగ్హాల గతులు.. సస్యవ్రద్ధి తదితర విషయాలన్నీ వినిపించటం సంప్రదాయం.
ఇలా చేస్తే ఫలితంగా కొత్త సంవత్సరంలో చోటు చేసుకునే విపత్తుల్లో తీవ్రత తగ్గిస్తాడన్నది నమ్మకం. ఉగాది రోజున ఖజానా అధికారులుస్వామివారికి హుండీ రాబడిని..ఆదాయ వ్యయాలను ఉత్సవాలకు సంబంధించిన విషయాల్ని.. ఇతర ఆలయాల విశేషాల్ని వినిపించటం గమనార్హం. శ్రీనివాసుడు ఆనందనిలయంలో కొలువై ఉన్నాడనటానికి.. అందరికి అన్నింటికీ ఆయనే అధిపతి అనటానికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనంగా చెబుతారు.
పూజలు పూర్తయ్యాక.. అక్కడున్న భక్తుల నుంచి రూపాయి చొప్పున సేకరించి.. అందరి పక్షాన తిరుమలేశుడికి ప్రత్యేకంగా ‘రూపాయి హారతి’ ఇస్తారు. ఆ రోజున వేంకటేశ్వరుడికి విశేషమైన పిండివంటల్ని నివేదిస్తారు. ఉగాది సాయంత్ం తిరుమల పురవీధుల్లో శ్రీదేవి - భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి ఊరేగింపును నిర్వహిస్తారు. ఉగాది నాటి సాయంకాలం ప్రారంభమయ్యే ఉత్సవం 40 రోజుల పాటు నాన్ స్టాప్ గా సాగుతుంది. దీన్నే నిత్యోత్సవంగా అభివర్ణిస్తారు.