Begin typing your search above and press return to search.

లడ్డూ ఇష్యూ : సుప్రీంకోర్టు మీదనే అందరి చూపు

మరో వైపు చూస్తే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.

By:  Tupaki Desk   |   29 Sep 2024 10:14 AM GMT
లడ్డూ ఇష్యూ : సుప్రీంకోర్టు మీదనే అందరి చూపు
X

గత కొద్ది రోజులుగా ఏపీతో పాటు దేశాన్ని అట్టుడికిస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయం మీద చర్చ అదే స్థాయిలో ఏపీలో పెద్ద ఎత్తున సాగుతున్న రాజకీయ రచ్చ అందరికీ తెలిసిందే. మరో వైపు చూస్తే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.

ఒక విధంగా చెప్పాలీ అంటే తిరుమల లడ్డూ అన్నది ఏపీకి పరిమితం అయినది కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించినది అని చూడాల్సి ఉంది. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏమి చెబుతుంది అన్న ఆసక్తి ఉత్కంఠ సర్వత్రా ఉంది.

శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది అని వస్తున్న ఆరోపణలు నిగ్గు తేల్చాల్సి ఉందని అందుకే తటస్థ వ్యవస్థతో దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్య స్వామి దీని మీద పిటిషన్ దాఖలు చేశారు

వాస్తవాలు అన్నీ వెలికి రావాలంటే సుప్రీంకోర్టు జడ్జి కానీ హై కోర్టు కి చెందిన సీనియర్ జడ్జి కానీ ఈ కేసుని టేకప్ చేయాలని కోరింది. వారి ఆధ్వర్యంలో ఈ కేసుని విచారించి పూర్తి నివేదికను అందించాలని స్వామి కోరుతున్నారు.

అదే విధంగా టీటీడీ చైర్మన్ గా నాలుగేళ్ల పాటు పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే అంశం మీద్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఫైల్ చేశారు. ఈ కేసు విషయంలో సీబీఐ కానీ లేక న్యాయ విచారణ కానీ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అంటున్నారు.

సుదర్శన్ న్యూస్ టీవీ ఎడిటర్ సురేష్ ఖండేరావ్ చవాంకే ఈ అంశంపై రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీతో దర్యాప్తు చేయాలని కోరుతూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు.

మరో వైపు చూస్తే ఈ కేసులో పిటిషన్ దాఖలు చేసిన చరిత్రకారుడు విక్రమ్ సంపత్ ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు దుష్యంత్ శ్రీధర్ దేవాలయాలపై ప్రభుత్వంతో పాటు అధికారిక పట్టును తొలగించాలని కోరుతున్నారు. ప్రభుత్వ సంస్థలు నిర్వహించే హిందూ దేవాలయాల్లో జవాబుదారీతనం ఏర్పాటు చేయాలని వీరిద్దరూ కోరుతున్నారు.

ఇక ఈ ఈ కేసుకు సంబంధించి అయిదు పిటిషన్లని కూడా పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ నెల 30న ఈ అంశం మీద విచారణ జరపనుంది. న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసుని విచారించనుంది.

సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏమి చెబుతుంది అన్నది ఇపుడు ఇంట్రెస్టింగ్ మ్యాటర్. ఇదిలా ఉంటే తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిట్ ని నియమించింది. సిట్ అపుడే విచారణను ప్రారంభించింది.

ఈ అంశాన్నే సుప్రీం కోర్టులో కూడా ఏపీ ప్రభుత్వం ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది. తాము సమగ్రమైన దర్యాప్తు జరిపిస్తునందున వేరే దర్యాప్తు అవసరం లేదని చెప్పనుంది. అయితే వైవీ సుబ్బారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ లో రెండు నెలల క్రితం లడ్డూలో కల్తీ నెయ్యి కలసింది అన్నది తేలితే దానిని ఆలస్యంగా బయటపెట్టడం వెనక రాజకీయ దురుద్దేశ్యాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సిట్ తో వాస్తవాలు బయటకు రావని అంటున్నారు. ఇలా ఈ కేసు విషయంలో పలు పిటిషన్లు దాఖలు కావడం శ్రీవారి ప్రపంచ దేవుడు కావడం కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఇందులో ముడిపడి ఉండడంతో సుప్రీంకోర్టు ఏ రకమైన తీర్పు ఇస్తుంది అన్నది చర్చగా ఉంది.