తిరుపతి జూ ఘటనలో వెలుగులోకి కొత్త విషయాలు!
తిరుపతి జూ పార్క్ లో దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూ పార్క్ లోని సింహం ఓ సందర్శకుడిని చంపేసింది.
By: Tupaki Desk | 16 Feb 2024 4:45 AM GMTతిరుపతి జూ పార్క్ లో దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జూ పార్క్ లోని సింహం ఓ సందర్శకుడిని చంపేసింది. సింహాలు ఉండే ఎన్ క్లోజర్ లోకి ఓ వ్యక్తి దూకాడు. దీంతో ఆ వ్యక్తిపై ఒక్కసారిగా "దొంగలపూర్" అనే మగ సింహం దాడి చేసి చంపేసింది. ఇలా సందర్శకుడిని సింహం మట్టుబెట్టిన ఘటన జూ పార్క్ సందర్శకులను, సిబ్బందిని షాక్ కి గురి చేసింది. ఈ సమయంలో ఈ ఘటనకు సంబందించిన ఒక ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
అవును... తిరుపతి జూపార్క్ ఘటనలో ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... మృతుడు ప్రహ్లాద్ గుర్జార్.. సింహం ఎన్‌క్లోజర్ లోకి దూకినట్లు తేలింది. అప్పటికే... సింహం తలను ముట్టుకోవడానికి అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందితో అతడు గొడవకు దిగినట్లు చెబుతున్నారు. అయితే అందుకు వారు ఏమాత్రం అనుమతించకపోవడంతో పాటు.. ప్రహ్లాద్ గుర్జార్ ను బయటకు పంపించివేశారట.
దీంతో... సిబ్బంది బటకు పంపించేయడంతో బయటకు వెళ్లినట్లే వెళ్లి.. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి సింహం ఎన్‌క్లోజర్ లోకి ప్రవేశించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సింహం అతడిపై దూకి చంపేసిందని అంటున్నారు. ఈ సమయంలో... లయన్ సఫారీకి వచ్చిన సందర్శకులు సింహం దాడిని గుర్తించి పెద్దగా అరవడంతో సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు స్పందించి సింహాన్ని బోన్ లోకి తరలించారని అంటున్నారు.
అయితే రాజస్థాన్ కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి బస్సులో తిరుపతి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిషేదిత ప్రాంతమైన లయన్ ఎన్ క్లోజర్ లోకి అతను దూకినట్లు భావిస్తున్నారు. దీంతో... "దొంగలపూర్" అనే మగసింహం అతడిపై దాడి చేసి చంపేసింది. దీంతో ప్రహ్లాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇక ఈ ఘటనపై చంద్రగిరి డీఎస్పీ శరత్ రాజ్ కుమార్, జూ క్యూరేటర్ సెల్వం స్పందిస్తూ... రాజస్థాన్ కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ (38) గురువారం మధ్యాహ్నం జూపార్కు సందర్శనకు వచ్చారని.. ఈ సమయంలో ప్రమాద హెచ్చరికలను ఏమాత్రం లెక్క చేయకుండా తాళం వేసి ఉన్న మొదటి గేటు ఎక్కి లోపలికి ప్రవేశించారని తెలిపారు. అనంతరం... కొంత దూరంలోని వాటర్ ట్యాంక్ మీదుగా సింహాల ఎన్ క్లోజర్ లోకి దూకడంతో అందులో ఉన్న సింహం అతడిని మెడ భాగంలో కొరికి చంపేసిందని తెలిపారు.