తిరుపతిలో పెను విషాదం... అసలేం జరిగింది?
అవును... తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు.
By: Tupaki Desk | 9 Jan 2025 4:19 AM GMTగోవింద నామాలతో మారుమ్రోగేచోట మృత్యు ఘోష వినిపించింది.. భక్తుల అరుపులు, ఆర్తనాదాలతో ఆధ్యాత్మిక నగరం దద్దరిల్లింది.. వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కోసమని క్యూలైన్లో నిల్చున్న వారు తొక్కిసలాటకు గురయ్యారు.. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు.. వారిలో ఆరుగురు ప్రాణాలు విడిచారు.. మరికొంతమంది మృత్యువుతో పోరాడుతున్నారు.
అవును... తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందారు. ఇందులో భాగంగా రాత్రి 7:30 ప్రాంతంలో శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంవద్ద జరిగిన తొక్కిసలాటలో తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) అనే మహిళ మృతి చెందారు!
అనంతరం జరిగిన తొక్కిసలాటలో మరికొంతమంది భక్తులు కిందపడిపోగా.. వారిని భక్తులు తొక్కుకుంటూ వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటన ఆస్పత్రికి తరలించగా... వీరిలో ఐదుగురు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు చెబుతున్నారు.
ఈ ఘటనల్లో మరో 48 మంది వరకూ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మృతుల వివరాలు వెళ్లడించారు. వీరిని విశాఖ కు చెందిన రజని (47), శాంతి (34), లావణ్య (40).. నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు (51).. బల్లారికి చెందిన నిర్మల (50) లుగా గుర్తించారు.
అసలేం జరిగింది?:
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా... ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం లక్షా 20 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ టోకెన్ల జారీ ప్రక్రియను 9వ తేదీ ఉదయం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో... బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంలోని నలుమూలలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులూ పెద్ద సంఖ్యలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేంద్రాల వద్దకు చేరుకున్నారు. బుధవారం సాయంత్రానికి భారీగా పోగయ్యారు.
ఈ క్రమంలో... రాత్రి 7 గంటల ప్రాంతంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లలోకి ప్రవేశించబోయారు. దీంతో.. తొలుత జీవకోన వద్ద ఉన్న జెడ్పీ హైస్కూల్ వద్ద స్వల్ప తోపులాట జరిగింది. ఈ సమయంలో ఎస్పీ అక్కడకు వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో పద్మావతి పార్కులో ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యారు.
ఈ ఘటన రాత్రి 8:15 నిమిషాల సమయంలో జరిగింది. దీంతో.. ఆ వ్యక్తికి వైద్యం అందించేందుకు అధికారులు గేట్లు తెరవబోయారట. అయితే... అందరికోసం గేట్లు తెరుస్తున్నారని భావించిన కొంతమంది భక్తులు ఒక్కసారిగా బలంగా తోసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో చాలా మంది కిందపడిపోయారు.
ఈ సమయంలో ఊపిరాడక పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే క్షతగాత్రులను పోలీసులు అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. ఆ సమయానికే ఊపిరాడక నలుగురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయినట్లు చెబుతున్నారు!
ఈ సమయంలో... తోపులాటకు దారితీసిన కారణాలపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఓ పక్క భక్తుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు సీసీ కెమరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగ ఈ తొక్కిసలాటలకు భక్తుల తొందరపాటే కారణమా లేక.. ఇందులో మరో కారణం ఏమైనా ఉందా అనే కోణంలో విచారించి సమగ్ర నివేదిక తయారు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో క్షతగాత్రుల వివరాలు, ఇతర సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన కలెక్టర్... 0877-2236007 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.
మరోపక్క వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో వస్తారని తెలిసినా.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయలేకపోయిందని అంటున్నారు.