అమ్మో.. తిరుమలను గుల్ల చేసేంత ముదురట!
దీంతో నిందితుడు గతంలోనూ చేతివాటం ప్రదర్శించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
By: Tupaki Desk | 14 Jan 2025 4:49 AMతిరుమల పరకామణిలో దొంగతనం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసు విచారణలో భాగంగా నిందితుడి ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా, 655 గ్రాముల బంగారు బిస్కెట్లు, 157 గ్రాముల వెండి లభించింది. దీంతో నిందితుడు గతంలోనూ చేతివాటం ప్రదర్శించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తిరుమల పరకామణిలో వంద గ్రాముల బంగారం బిస్కెట్ దొంగిలించి దొరికిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగి వీరిశెట్టి పెంచలయ్య నుంచి పోలీసులు రూ.46 లక్షల విలువైన ఆభరణాలు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 11న నిందితుడు పరకామణిలో బంగారం బిస్కెట్ తస్కరించి విజిలెన్స్ అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. అబ్రిపోస్ అనే సంస్థ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న పెంచలయ్య వ్యవహారశైలి సందేహాస్పదంగా ఉండటంతో విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే గత శనివారం పరకామణి నుంచి ట్రాలీ పైపులో బంగారం బిస్కెట్ దాచిన పెంచలయ్య పట్టుబడ్డాడు.
తిరుమల దేవాలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తిరుమల వన్ టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఇంట్లో సోదాలు నిర్వహించి 655 గ్రామలు బంగారు బిస్కెట్లు, 157 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.46 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పటిష్ట నిఘా ఉండే పరకామణిలో దొంగతనం చేయడం సంచలనంగా మారింది. రెండేళ్ల నుంచి పరకామణిలో విధులు నిర్వహిస్తున్న పెంచలయ్య ఎప్పటి నుంచి చేతివాటం ప్రదర్శిస్తున్నాడనేది విచారించాల్సివుంది. ఈజీ మనీ కోసం ఆశపడి శ్రీవారి బంగారాన్ని దొంగిలించాడని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంలో నిందితుడు ఒక్కడే ఈ పనిచేశాడా? లేక అతడికి ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.