తిరుపతిలో కాబోయే డాక్టర్ల మధ్య దారుణంగా తన్నులాట!
మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఉదంతంలో వైద్య విద్యార్థుల్లోని ఒకరు.. మరో ఇద్దరు విద్యార్థులపై దాడికి తెగబడ్డారు
By: Tupaki Desk | 16 Aug 2023 4:49 AM GMTవారంతా కాబోయే డాక్టర్లు. మరో ఏడాది.. రెండేళ్లలో పవిత్రమైన వైద్య వృత్తిలోకి అడుగు పెట్టే వేళ.. బాధ్యత లేని చిల్లరగాళ్లు ఏ రీతిలో అయితే కొట్టేసుకుంటారో.. అంతకు మించి అన్నట్లుగా వ్యవహరించిన వీరి తీరు చూస్తే.. వీరా సమాజానికి ఆదర్శంగా నిలిచేదన్న భావన కలుగక మానదు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య కళాశాలకు చెందిన విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉదంతం షాకింగ్ గా మారింది.
మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఉదంతంలో వైద్యవిద్యార్థుల్లోని ఒకరు.. మరో ఇద్దరు విద్యార్థులపై దాడికి తెగబడ్డారు. అది కాస్తా విద్యార్థుల మధ్య ఘర్షణగా మారింది. తిరుపతి పడమర సీఐ కథనం ప్రకారం తిరుపతి జిల్లాకు చెందిన గణేశ్ ఎస్వీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతగాడు యూజీ హాస్టల్ లో ఉంటున్నాడు. అతడి రూంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు మహేశ్.. ప్రవీణ్ లు ఉన్నారు. సోమవారం సాయంత్రం ఈ ముగ్గురూ కారులో బయటకు వెళ్లి మద్యం సేవించారు.
అంతవరకు బాగానే ఉన్నా.. మద్యం మత్తులో బిల్లు చెల్లించే విషయంలో వారి మధ్య తేడాలు వచ్చాయి. గతంలోనూ వీరి మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో.. తాజాగా మరోసారి గొడవైంది. బిల్లు చెల్లింపు తేడా తర్వాత ఇద్దరు సీనియర్లు తనతో మాట్లాడకపోవటంతో వారిని గణేశ్ నిలదీశాడు. అయినా వారు పెద్దగా స్పందించలేదు. వారు నిద్ర పోయాక వారిపై ఆగ్రహానికి గురైన గణేశ్.. తన రూంలో ఉండే సీనియర్ మహేశ్ తలపై క్రికెట్ స్టంప్ తో కొట్టాడు. దీంతో.. తీవ్రమైన నొప్పితో పెద్దగా అరుస్తూ మహేశ్ నిద్ర లేచాడు. ఈ గొడవకు ప్రవీణ్ కూడా నిద్ర లేచాడు. గణేశ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిద్దరిపైనా క్రికెట్ స్టంప్ లో దాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో క్రికెట్ స్టంప్ కూడా విరిగిపోవటం గమనార్హం.
ఈ అరుపులు.. కేకలతో సహచర విద్యార్థులు నిద్ర లేచారు. హాస్టల్ ప్రాంతంలో ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాని పరిస్థితి. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య తన్నులాట జరిగినట్లుగా చెబుతున్నా.. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. హాస్టల్ గదిలోని కూరగాయల కత్తితో దాడి చేస్తూ మహేశ్ గొంతుపై కోశాడు గణేశ్. విద్యార్థులంతా లేచి.. అతడ్ని వెంటబడగా.. అతను హాస్టల్ నుంచి పారిపోయాడు. గాయాలపాలైన ప్రవీణ్.. మహేశ్ లను రుయా ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. మహేశ్ కు వైద్యులు సర్జరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్య విద్యార్థులుగా ఉంటూ.. కెరీర్ మీద ఫోకస్ చేయటం వదిలేసి.. మందు పార్టీలకు వెళ్లటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.