Begin typing your search above and press return to search.

టీఎంసీ జాబితా.. మోడీకి ధీటుగా దీదీ రేసుగుర్రాలు

ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ) తాజాగా తమ జాబితాను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   11 March 2024 8:30 AM GMT
టీఎంసీ జాబితా.. మోడీకి ధీటుగా దీదీ రేసుగుర్రాలు
X

ఇప్పుడు కాకుంటే మరెప్పటికి కాదన్నట్లుగా భావిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ సొంతంగా తన సత్తా చూపించే ఛాన్సు లేదు. దేశంలో మరే జాతీయ పార్టీ సైతం తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ లేకపోవటం.. ప్రాంతీయ పార్టీలు సైతం పరిమితుల చట్రాలకు పరిమితమైన నేపథ్యంలో అప్పుడెప్పుడో ఇందిరమ్మ హయాంలో సాధించిన 400ప్లస్ సీట్లను ఈసారి తన కూటమితో సొంతం చేసుకోవాలన్నది మోడీ ఆలోచనగా చెబుతారు. అంతేకాదు.. బీజేపీ సొంతంగా 370 మంది ఎంపీల్ని గెలిపించుకోవాలన్న కసితో ఆయన ఉన్నారు.

ఇలాంటి వేళ.. ఎక్కువ లోక్ సభా స్థానాలు ఉన్న రాష్ట్రాల మీద మోడీషాల కన్ను ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వారు పశ్చిమ బెంగాల్ మీద ప్రత్యేక ఫోకస్ పెడతారన్నది తెలిసిందే. బెంగాల్ లో మొత్తం 42 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అత్యధిక స్థానాల్ని సొంతం చేసుకుంటే సొంత మెజార్టీకి మరింత పెరిగే ఛాన్సు ఉంది. అందుకే.. తాము బరిలో నిలిపే రేసు గుర్రాల విషయంలో ప్రత్యేక కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ) తాజాగా తమ జాబితాను విడుదల చేశారు.

టీఎంసీ అభ్యర్థుల జాబితాను చూస్తే.. మోడీ వ్యూహానికి ధీటుగా మమత ప్లానింగ్ ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి బహరంపూర్ నియోజకవర్గంలో టీఎంసీ తన అభ్యర్థిగా క్రికెటర్ యూసఫ్ పఠాన్ ను ఎంపిక చేయటం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 1999 నుంచి ఇప్పటివరకు ఈ స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి ఐదుసార్లు గెలిచారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఆయన గెలిస్తే డబుల్ హ్యాట్రిక్ సాధించిన వారు అవుతారు. అయితే.. టీఎంసీ అభ్యర్థిగా యూసఫ్ పఠాన్ బరిలోకి రావటంతో ఇక్కడి పోటీ రంజుగా మారింది.

ఇండియా కూటమిలో ఉన్న దీదీ.. కాంగ్రెస్ తో పొత్తు లేకుండా రాష్ట్రంలోని 42 స్థానాలకు తన అభ్యర్థుల్ని ప్రకటించటం ద్వారా.. తాను వీలైనన్ని ఎక్కువ స్థానాల్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాలు గెలవగా.. బీజేపీకి 18 స్థానాల్ని సొంతం చేసుకున్నారు. ఈసారి ఈ రెండు పార్టీలు గతానికి మించి మెరుగైన సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్లే వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటున్నారు.

బీజేపీ విషయానికి వస్తే బెంగాల్ ప్రజలతో పాటు.. బెంగాల్ లో కీలక స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మైనార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు వీలుగా బీజేపీ తన అభ్యర్థిగా భారత క్రికెటర్ మహ్మద్ షమీని బరిలోకి దింపుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఆయన్ను బసీర్హట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నారు. షమీని అభ్యర్థిగా బరిలోకి దించటం ద్వారా దాదాపు 13 ఎంపీ స్థానాల్లోని మైనార్టీలను ప్రభావితం చేయటంతో పాటు.. మరిన్ని స్థానాల్ని సొంతం చేసుకోవాలన్నది ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే షమీతో కమలనాథులు చర్చలు జరిపారు. అయితే.. షమీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.

మైనార్టీల మనసును దోచేందుకు మోడీ వేసిన ఎత్తుగడను గుర్తించి దీదీ.. తమ అభ్యర్థిగా మరో క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను తమ అభ్యర్థిగా ప్రకటించటం ద్వారా ఎత్తుకు పైఎత్తు వేసినట్లుగా చెప్పాలి. నిజానికి యూసఫ్ పఠాన్ గుజరాత్ కు చెందినప్పటికి అతను దాదాపు ఆరేళ్లకు పైనే (2011-2017) కోల్ కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ లో ఆడారు. ఆ అనుబంధాన్ని పరిగణలోకి తీసుకున్న దీదీ.. ఆయన్ను ఎన్నికల బరిలోకి తీసుకొచ్చారు. ఈ లెక్కన చూస్తే.. షమీ విషయంలో మోడీషాలు చర్చల స్థాయిలో ఉంటే.. దీదీ మరో అడుగు ముందుకేసి ఏకంగా తమ అభ్యర్థిని బరిలోకి దింపేయటం ప్లస్ అవుతుందని చెబుతున్నారు.

దీదీ రేసుగుర్రాల జాబితాను చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యమైనవి చూస్తే..

- మమతా మేనల్లుడు, ఆమె రాజకీయ వారసుడిగా పేరున్న అభిషేక్ బెనర్జీకి డైమండ్ హార్బర్ స్థానాన్ని కేటాయించారు.

- లోక్ సభలో ప్రశ్నను అడిగేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణతో సభ నుంచి సస్పెండ్ అయిన మహువా మెయిత్రాకు క్రిష్ణా నగర్ టికెట్ కేటాయించారు.

- బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా అసన్సోల్ నుంచి బరిలోకి దించారు.

- బిష్ణుపూర్ స్థానాన్ని సుజాత మోండల్ ఖాన్ కు కేటాయించారు. ఇక్కడ విశేషం ఏమంటే.. ఆమె తన మాజీ భర్త.. బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్ పై పోటీ చేయనున్నారు. మొదట్లో వీరిద్దరూ బీజేపీలో ఉన్నా.. సుజాత 2020లో బీజేపీ నుంచి టీఎంసీలోకి వచ్చేశారు. గంటల వ్యవధిలోనే ఆమె భర్త విడాకుల నోటీసులు పంపటం అప్పట్లో సంచలనమైంది.