ఎంతో తెలివైన ఏపీ ప్రజలను కేంద్రం ఫూల్స్ చేస్తుంది - మహువా మోయిత్రా
ఏపీ ప్రజలు మళ్ళీ నమ్మి బీజేపీని గెలిపించారు. 2014లో ఉన్న మోజుని మళ్లీ 2024లోనూ చూపించారు.
By: Tupaki Desk | 7 Aug 2024 3:43 AM GMTఏపీ ప్రజలు మళ్ళీ నమ్మి బీజేపీని గెలిపించారు. 2014లో ఉన్న మోజుని మళ్లీ 2024లోనూ చూపించారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వస్తే ఏపీని ఉద్ధరిస్తారు అని తలపోశారు. కానీ జరిగేది వేరుగా ఉంటోంది అని అనుమానాలు అయితే ఉన్నాయి.
ప్రత్యేక హోదా అన్న మాట ఈసారి ఎవరి నోటా రాలేదు. ఈ విషయంలో టీడీపీ జనసేన ముందే జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అది ముగిసిన అధ్యాయం అని కేంద్రం ఎపుడో చెప్పేసింది. దానికి బదులుగా ప్రత్యేక ప్యాకేజి అని 2014 నుంచి 2018 మధ్యలో ప్రకటించింది. ఇపుడు అది కూడా వినిపించడం లేదు.
పోనీ దానికి బదులుగా దండీగా నిధులు ఏమైనా ఇస్తోందా అంటే అది కూడా లేదు. ఏపీలోని అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేస్తోంది అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఉండడమా అని కూడా అన్నారు. అన్నీ చెప్పిన తరువాత ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం ఇప్పిస్తున్నట్లుగా చెప్పారు.
అపుడే ఏపీకి అప్పు తప్ప గ్రాంట్ ఇవ్వలేదని అర్ధం అయింది. అయినా ఏపీ బీజేపీ నేతలు కొందరు ఏపీకి ఉదారంగా కేంద్ర సాయం అంటూ ఊదరగొట్టారు. ఇపుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నిండు పార్లమెంట్ లో ఏపీకి కేంద్రం చేసిన సాయమేంటో చెప్పి ఏపీ ప్రజల కళ్ళు తెరిపించారు అనుకోవాలి.
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభలో బడ్జెట్ మీద జరిగిన చర్చలో మాట్లాడుతూ ఏపీకి కేంద్రం ప్రకటించిన 15 వేల కోట్లు లోన్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఆ అప్పుని ఏపీ ప్రజలతో పాటు భవిష్యత్తు తరాలు కూడా వడ్డీతో సహా చెల్లించాలి అని ఆమె అన్నారు. ఇక ఏపీలోని వెనకబడిన ప్రాంతాల్లో కూడా ప్రత్యేక గ్రాంట్ ఇస్తామని కేంద్రం చెప్పింది కానీ బడ్జెట్ లో దాని గురించి భూతద్దంలో వెతికిపెట్టినా ఎక్కడా కనిపించలేదని ఆమె ఎద్దేవా చేశారు.
ఎంతో తెలివైన ఏపీ ప్రజలను కేంద్రం ఫూల్స్ గా చేస్తోంది అని మహూవా ఫైర్ అయ్యారు. దీనిని బట్టి చూస్తే కేంద్రం ఏపీకి అప్పు ఇచ్చిందని దాని వడ్డీలు నడ్డి విరిగేలా ఏపీ జనాలు కట్టాల్సిందే అని చెప్పేశారు. మరి ఏపీ బీజేపీ నేతలు దీని మీద ఇపుడు ఏమంటారో చూడాలని అంటున్నారు.
ఒక వైపు ఏపీలో టీడీపీ ఎంపీల మద్దతుతో కేంద్రం అధికారంలో ఉంది. అయినా కానీ ఏపీకి మాత్రం గ్రాంట్స్ ఇవ్వడానికి ఎందుకు సిద్ధంగా లేదు అన్నది సగటు జనం ప్రశ్న. అప్పులు ఇవ్వడమేంటి అన్నది కూడా వారి ఆగ్రహం. ఈపాటి అప్పుల కోసం కేంద్రం సాయం అని ప్రకటించుకోవడమా అని మేధావులు సైతం ప్రశ్నించే పరిస్థితి. ఏది ఏమైనా ఏపీకి కేంద్రం విభజన చట్టంలోని అన్ని హామీలను తీర్చడానికి ముందుకు రావాలని ఆ విధంగా ఒత్తిడి తెచ్చేలా కూటమి పార్టీలు ప్రయత్నం చేయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.