Begin typing your search above and press return to search.

సముద్రం మీద వెళ్లే విమానాల జీపీఎస్ జామ్... "టోబోల్‌" పనేనా?

కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో... దీనికి గల కారణంపై ఒక కథనం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   24 April 2024 2:30 AM GMT
సముద్రం మీద వెళ్లే విమానాల జీపీఎస్ జామ్... టోబోల్‌ పనేనా?
X

ఇటీవల కాలంలో విమానాల్లో సమస్యల గురించి తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో... ప్రధానంగా వాటిలోని జీపీఎస్‌ జామ్‌ సమస్య తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బాల్టిక్‌ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు జీపీఎస్‌ జామ్‌ అనే అంశం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. కొంతకాలంగా వందల సంఖ్యలో విమానాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో... దీనికి గల కారణంపై ఒక కథనం తెరపైకి వచ్చింది.

అవును... బాల్టిక్‌ సముద్రం మీదుగా వెళ్లే విమానాలు ఎదుర్కొంటున్న జీపీఎస్‌ జామ్‌ సమస్యకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఈ సమస్యకు అసలు కారణం రష్యా రహస్య ఆయుధం అయ్యి ఉండొచ్చని.. దాని పేరు టోబోల్‌ అని.. గతంలో నాటో తూర్పు ప్రాంతంలో నౌకల సిగ్నల్స్‌ ను అడ్డుకునేందుకు ఈ సాంకేతిక ఆయుధాన్ని రష్యా ఉపయోగించిందని చెబుతున్నారు.

ఈ మేరకు "ది సన్‌" మీడియా వెల్లడించిన కథనం ప్రకారం... లిథువేనియా - పోలాండ్‌ మధ్యలోని కాలినిన్‌ గ్రాడ్‌ లోని రష్యా సైనిక స్థావరం కేంద్రంగా ఈ సాంకేతిక ఆయుధం పనిచేస్తుంది. దీనికి సంబంధించి అక్కడి సైనిక స్థావరం వద్ద భారీ సైజులో ఉన్న శాటిలైట్‌ డిష్‌ ల ఫోటోలను ఆ మీడియా ఉదహరించింది. ఇవన్నీ "టోబోల్‌"లో భాగమేనని.. రష్యా వద్ద పలాంటివి సుమారు పది పరికరాల ఆయుధాలు ఉన్నాయని వెల్లడించింది.

ఇదే సమయంలో... "వాషింగ్టన్‌ పోస్ట్‌" కథనం ప్రకారం... శాటిలైట్‌ సిగ్నల్స్‌ ను అడ్డుకోవడం వల్ల తమ స్థావరాలు నాటో క్షిపణులకు లక్ష్యంగా మారకుండా ఉండేందుకే మాస్కో ఈ వ్యవస్థను వినియోగించుకున్నట్లు చెబుతున్నారు. ఇది రెండు విధాలుగా పని చేస్తుందని అంటున్నారు. ఇందులో ఒకటి... ఆకాశంలో శాటిలైట్లను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం కాగా.. రెండోది ఈ తరహాలో జామింగ్‌ ద్వారా వాస్తవ సిగ్నల్స్‌ ను ఏమార్చడం అని వెల్లడిస్తున్నారు.

ప్రస్తుతం ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో స్టార్‌ లింక్‌ ప్రసారాలకు అంతరాయం కలిగించేందుకు రష్యా ఈ ప్రయోగాలు చేసినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఇదే క్రమ్మలో... ఈ సాంకేతిక ఆయుద్ధం ద్వారానే బాల్టిక్ సముద్రమార్గంలో వెళ్లే వేలాది విమానాలు సిగ్నల్‌ సమస్యను ఎదుర్కొన్నాయని, వాటిని నేవిగేట్‌ చేయడం కష్టంగా మారిందని నిపుణులు అంచనా వేశారని వెల్లడించింది!