ఇది అంకెల బడ్జెట్టే.. విమర్శకాదు.. నిజం!
మరీముఖ్యంగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న, చెందాల్సిన ఐటీ రంగానికి కేవలం 720 కోట్ల రూపాయ లను మాత్రమే ప్రతిపాదించారు.
By: Tupaki Desk | 26 July 2024 12:30 AM GMTతెలంగాణ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఏడు మాసాలకు సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ కేవలం అంకెల గారడీని మాత్రమే తలపించేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకులను పక్కన పెడితే.. ఆర్థిక వేత్తలు కూడా.. ఈ బడ్జెట్‌పై పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.2 లక్షల 91 వేల 159 కోట్ల మేరకు ఉన్నా.. దీనిలో రెవెన్యూ వ్యయమే రూ.2,20,945 కోట్లుగా ఉంది. అంటే.. ఇది వేతనాలు.. జీత భత్యాలకు కేటాయించారు. దీంతో మిగిలిన సొమ్మును ఇతర పథకాలకు కేటాయించారు.
మరీముఖ్యంగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న, చెందాల్సిన ఐటీ రంగానికి కేవలం 720 కోట్ల రూపాయ లను మాత్రమే ప్రతిపాదించారు.ఇది ఆ రంగానికి ఏ మూలకూ చాలదని నిపుణులు చెబుతున్నారు. ఇక, కీలకమైన పెట్టుబడల ఆకర్షణకు.. అభివృద్ధి మంత్రాన్ని పఠించేందుకు ముఖ్యమైన మూలధన వ్యయం లో భారీగా కోత పెట్టారు. దీనిని రూ.33,487 కోట్లుగా చూపించారు. ఇది కూడా.. రాష్ట్ర పురోగతికి ఏ మాత్రం సహకరించదని చెబుతున్నారు. అదేవిధంగా వ్యవసాయానికి కేటాయింపులు చాలా చాలా తక్కువగా ఉన్నాయి.
వ్యవసాయ ఆధారిత జిల్లాలు ఎక్కువగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు దైన్య పరిస్థితితాండవిస్తోంది. ఈ క్రమంలో రైతులను ఒడ్డున పడేసేందుకు 72 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. కానీ, ఈ నిధులను ఎక్కడ నుంచి తెస్తారో చెప్పకపోవడం గమనార్హం. గతంలోనూ కూడా.. ఏకంగా 90 కోట్లు ప్రకటించిన బీఆర్ ఎస్ ప్రభుత్వం తర్వాత ఖర్చు చేసింది 40 కోట్లు మాత్రమే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుందనే అంచనాలు వస్తున్నాయి. దీంతో వ్యవసాయానికి కీలకమైన గిడ్డంగుల నిర్మాణం ఎలా జరుగుతుందనేది ప్రశ్న. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధికి కూడా.. నిధుల లేమి కనిపిస్తోంది.
అదేవిధంగా తెలంగాణ ఇప్పుడు హార్టీ కల్చర్ హబ్‌గా రూపొందుతోంది. విదేశాలకు ఇక్కడ నుంచి ఎగుమతులు కూడా జరుగుతున్నాయి. ఈ రంగాన్ని డెవలప్ చేస్తే.. ఉపాధితోపాటు రాష్ట్రానికి ఆదాయం కూడా చేకూరుతుంది. కానీ, ఈ రంగానికి కేవలం 737 కోట్లు మాత్రమే కేటాయించారు. దీనివల్ల ఆ రంగం అభివృద్ధి చెందే పరిస్థితి అయితే కనిపించడం లేదు. పశుసంవర్ధక శాఖకు రూ.1,980 కోట్లు కేటాయించినా.. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. నిధుల కేటాయింపే తప్ప.. ఖర్చును చూపించలేక పోతున్నారు. మొత్తంగా చూస్తే.. తెలంగాణ బడ్జెట్ అంతా కూడా.. అంకెల గారడీనే తలపిస్తోందని మేధావి వర్గాలు చెబుతున్నాయి.