Begin typing your search above and press return to search.

జపాన్ పై అణుబాంబును మించిన ఆ దారుణ దాడికి 80 ఏళ్లు

తనపై భీకరమైన అణు దాడి చేసిన అమెరికాతోనే చివరకు స్నేహంగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   11 March 2025 4:00 PM IST
జపాన్ పై అణుబాంబును మించిన ఆ దారుణ దాడికి 80 ఏళ్లు
X

చరిత్రలో జరిగిన మొదటి, చివరి అణు దాడి ఒకటే.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ నగరాలు హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన అణుబాంబులు చరిత్రలో మాయని మచ్చ. అప్పటివరకు యుద్ధంలో దూకుడుగా వెళ్లిన జపాన్ ఆ తర్వాత తన పంథా మార్చుకుంది. పూర్తి శాంతి కాముక దేశంగా మారిపోయింది. తనపై భీకరమైన అణు దాడి చేసిన అమెరికాతోనే చివరకు స్నేహంగా మారిపోయింది.

అయితే, జపాన్ పై అణుదాడినే ఇంతవరకు అందరూ గుర్తుపెట్టుకున్నారు. కానీ, దానికిముందే అత్యంత భయంకర దాడి జరిగిన సంగతిని మాత్రం మర్చిపోయారు. అదేమంటే.. క్లస్టర్ బాంబుల దాడి. ఇది జరిగి 80 ఏళ్లు అవుతోంది.

క్లస్టర్ బాంబులు.. అంటే ఏమిటో కాదు.. బాంబుల గుత్తి. చాలా బాంబులను కలిపి కట్టిన మూట. అలాంటి క్లస్టర్ బాంబులను వేల సంఖ్యలో జపాన్ పై విడిచిపెట్టింది అమెరికా. ఒకరకంగా మారణ హోమం రేపింది.

1945 మార్చి 10న జరిగిన ఈ ఘటనలో లక్షమంది పైగా జపనీయుల మృతిచెందారు. 1945 ఆగస్టులో జరిగిన అణుబాంబు దాడి కంటే ముందే ఈ దాడి జరిగిందన్న మాట. నాడు బీ-29 అమెరికన్‌ బాంబర్‌ విమానాలు నాపాం కూర్చిన క్లస్టర్‌ బాంబులను జపాన్ రాజధాని టోక్యోపై వేశారు.

జపాన్ కోల్డ్ కంట్రీ. పైగా భూకంపాల బెడద ఎక్కువ. అందుకని ఆ దేశంలో ఇళ్లను చెక్కతో కడతారు. అమెరికా బాంబు దాడిలో జపనీయుల ఇళ్లకు నిప్పు అంటుకుంది. కారణం.. అమెరికా వేసిన బాంబుల్లో ఓ తరహా జిడ్డు నూనెను వాడడమే. దీంతో ఇళ్లనీ దగ్ధం అయ్యాయి. బాంబు అగ్నిగోళాల ధాటికి ఆకాశం అంతా ఎర్రబడింది.

1.05 లక్షల మంది మరణించగా, లక్షలమంది నిరాశ్రయులయ్యారు. 1945 ఆగస్టు 9న నాగసాకిపై అణుబాంబు దాడిలో చనిపోయినవారి కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.

హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడిలో మరణించిన వారి కుటుంబాలు, సైనికులకు నష్ట పరిహారం కింద, వైద్య సాయంగా జపాన్‌ ప్రభుత్వాలు 40,500 కోట్ల డాలర్లు అందించాయి. టోక్యోపై క్లస్టర్ బాంబు దాడి బాధితులను మాత్రం ఆదుకోలేదు.

అప్పుడు 10 ఏళ్లు.. ఇప్పుడు 90 ఏళ్లు

1945లో బాంబు దాడి జరిగిన సమయంలో పదేళ్ల పిల్లలు ఇప్పుడు తొంభై ఏళ్ల వయసుకు వచ్చారు. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందేమోనని ఇటీవల సమావేశమయ్యారు. అప్పుడేం జరిగిందో పుస్తకంగా రాస్తున్నారు. ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు.