గోదావరి ప్రయోగం...కూటమికి ప్రమాదం ?
ప్రభుత్వం దగ్గర ఉన్న సొమ్ముతో గుంతలు పూడ్చేందుకు 900 కోట్లను కేటాయించిందని ఆయన చెప్పారు.
By: Tupaki Desk | 22 Nov 2024 6:30 AM GMTఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జాతీయ స్థాయి రోడ్లకు టెండర్లను పిలిచి నట్లుగానే ఏపీలోని రోడ్లకు కూడా టెండర్లు పిలిచి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించాలన్న తన ఆలోచనలు వివరించారు.
ప్రభుత్వం దగ్గర ఉన్న సొమ్ముతో గుంతలు పూడ్చేందుకు 900 కోట్లను కేటాయించిందని ఆయన చెప్పారు. అయితే రానున్న రోజులలో రోడ్లు అందంగా మారాలన్నా పటిష్టంగా ఉండాలన్నా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాల్సిందే అని ఆయన చెప్పారు. ఈ విధంగా చేస్తే కనుక రోడ్లు అద్దాలుగా మారుతాయని దానితో పాటే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో పాటు రోడ్లు రావాలీ అంటే టోల్ టాక్స్ వసూలు చేయాల్సిందే అని అన్నారు
గ్రామాలు మండలాలను మినహాయించి పట్టణాలు నగరాలకు టోల్ టాక్స్ ని వర్తింపచేస్తామమి చెప్పారు. అలాగే బైకులు ట్రక్కులు ట్రాక్టర్లకు టోల్ టాక్స్ ఉండదని కూడా చెప్పారు. ఇవన్నీ చెబుతూనే ముందుగా ఈ ప్రయోగం గోదావరి జిల్లాల నుంచే మొదలెడదామని బాబు సూచించారు. అంతే కాదు ప్రజా ప్రతినిధులు అంతా ఈ విషయం మీద ప్రజలకు అవగాహన కల్పించి వివరించాలని కోరారు
అభివృద్ధి కావాలీ అంటే పబ్లిక్, ప్రయివేటు, ట్రాన్స్ ఫర్ పద్ధతిలో గ్రామీణ రోడ్లను నిర్మిస్తామని బాబు అంటున్నారు. ఈ విధానం కొత్త ఆలోచన అని సక్సెస్ అయితే డబ్బు అవసరం లేకుండా అభివృద్ధిని చూడవచ్చు అని కూడా అంటున్నారు.
కానీ ఇది వికటించే ప్రమాదం ఉందని అంటున్నారు. ప్రజలు ఎటూ పన్నులు కడుతారు. దానినే సర్కార్ కి ఆదాయం రూపంలో ఖజానాలో చేరుతుంది. తాము కట్టిన పన్నులతో తమకు సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ప్రభుత్వం మాత్రం మళ్లీ టోల్ టాక్స్ పేరుతో బాదుతామంటే ఎవరు ఊరుకుంటారు అన్న చర్చ సాగుతోంది.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యతని అలాంటపుడు మధ్యలో ప్రజలు ఎందుకు వస్తారని అంటున్నారు. ఒక వైపు జాతీయ రహదారి మీద టోల్ టాక్స్ పేరుతో వీర బాదుడు బాదుతున్నారు. ఇపుడు రాష్ట్రంలోని రోడ్లకు కూడా టోల్ దెబ్బ పడితే జనం ఊరుకోరని అంటున్నారు
అంతే కాదు ఎక్కువ మంది ఉపయోగించేది రాష్ట్ర రోడ్లనే అని కూడా లెక్కలు చెబుతున్నాయి. జనాలు ఎక్కువగా ప్రయాణించేది కూడా తమ ఉద్యోగ ఉపాధి నిమిత్తమే అని కూడా గుర్తు చేస్తున్నారు. ఈ టైం లో టోల్ బాదుడు అంటూ మొదలెడితే మాత్రం కూటమి ప్రభుత్వం ఇబ్బందులో పడుతుందని అంటున్నారు.
గోదావరి జిల్లాలు అసలే రాజకీయంగా చైతన్యం కలిగినవి అన్నది తెలిసిందే. వారు కనుక ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే కష్టమే అని అంటున్నారు. అయినా జనాలు ఎపుడూ తమ మీద భారాలు పడకూడదనే అనుకుంటారని ఆ విషయం తెలియదా అని అంటున్నారు. ఏది ఏమైనా బాబు వినూత్న ఆలోచనలు అమలు చేయాలా లేదా అన్నది కూటమిలో అంతా కలసి నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.
ఇప్పటికే వివిధ కారణాల వల్ల నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఇతరత్రా ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. జనాలు అనేక రకాలుగా ఇబ్బందులో ఉన్నారు. వారి మీద టోల్ బాదుడు అంటూ మొదలెడితే సీన్ రివర్స్ ఖాయమని అంటున్నారు.