దుబాయ్ లో మరణించిన కేదార్ ప్లాట్ లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే?
టాలీవుడ్ యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి మంగళవారం దుబాయ్ లో కన్నుమూసినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఒక వివాహ వేడుకకు వెళ్లిన అతను.. నిద్రలోనే కన్నుమూసినట్లుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 26 Feb 2025 5:27 AM GMTటాలీవుడ్ యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి మంగళవారం దుబాయ్ లో కన్నుమూసినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఒక వివాహ వేడుకకు వెళ్లిన అతను.. నిద్రలోనే కన్నుమూసినట్లుగా చెబుతున్నారు. సినీ.. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత కేదార్ కన్నుమూసినట్లుగా సమాచారం వస్తున్నా.. అధికారికంగా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే.. ఈ వ్యవహారంలో మరో కోణం ఇప్పుడు బయటకు వచ్చింది.
విజయదేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేషా మూవీకి కేదారే నిర్మాత. కేదార్ పై గతంలో డ్రగ్స్ పార్టీ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది రాడిసన్ హోటల్ డ్రగ్స్ ఉదంతంలో అతన్ని అరెస్టు చేశారు. దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయటంతో పాటు.. టాలీవుడ్ లోని పలువురు అగ్రహీరోలకు సన్నిహితుడిగా పేరుంది.
హైదరాబాద్ మహానగరంలోని పలు పేరున్న రియల్ ఎస్టేట్ యజమానుల కుటుంబాలతో పాటు రాజకీయ.. సినిమా రంగాలకు చెందిన ప్రముఖులతోనూ కేదార్ కు మంచి లింకులు ఉన్నట్లుగా చెబుతున్నారు. దుబాయ్ లో కన్నుమూసిన ప్లాట్ లోనే బీఆర్ఎస్ కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించటం లేదు.
అనుమానాస్పద మరణంగా దుబాయ్ పోలీసులు నమోదు చేశారని.. ప్రస్తుతం సదరు మాజీ ఎమ్మెల్యేను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేదార్ కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఇద్దరు ఒకే ప్లాట్ లో ఎందుకు ఉంటున్నారు? లాంటి ప్రశ్నలతో పాటు.. సదరు ప్లాట్ యజమాని ఎవరు? వీరిద్దరు ఎప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు? లాంటి అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సదరు మాజీ ఎమ్మెల్యే నాలుగు నెలలుగా దుబాయ్ లోనే ఉంటున్నారని.. అక్కడే వ్యాపారాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
దుబాయ్ లోని అత్యంత ఖరీదైన జుమేరియా ప్రాంతంలోనే కేదార్ తో పాటు సదరు మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు సినీ.. రాజకీయ ప్రముఖులతో కేదార్ దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కేదార్ ప్రత్యేకంగా ప్రైవేటు విమానాన్ని కూడా వినియోగిస్తారని చెబుతున్నారు. కేదార్ నిర్మాతగా మారక ముందు హైదరాబాద్ మహానగరంలోని ఒక పబ్ లో భాగస్వామిగా ఉన్నట్లుగా చెబుతారు. గత ఏడాది ఫిబ్రవరి 26న డ్రగ్స్ కేసులో కేదార్ పేరు వెలుగులోకి రాగా.. సరిగ్గా ఏడాది తర్వాత ఫిబ్రవరి 25న కేదార్ దుబాయ్ లో మరణించటం విస్మయానికి గురి చేస్తోంది. ఈ మరణంతో పాటు అతడితో ఉన్న మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సంబంధించిన వివరాలు బయటకు రావాల్సి ఉంది.