Begin typing your search above and press return to search.

టాలీవుడ్ నిర్మాతల తీరు : టీడీపీ గవర్నమెంట్ ఉంటేనే ప్రజలు...వైసీపీ గవర్నమెంట్ ఉంటే కాదా ?

టాలీవుడ్ ఏపీ వరదల మీద బాగానే ఉదారత చూపిస్తోంది. ఇది కావాల్సిందే.

By:  Tupaki Desk   |   6 Sep 2024 10:30 PM GMT
టాలీవుడ్ నిర్మాతల తీరు : టీడీపీ గవర్నమెంట్ ఉంటేనే ప్రజలు...వైసీపీ గవర్నమెంట్ ఉంటే కాదా ?
X

టాలీవుడ్ ఏపీ వరదల మీద బాగానే ఉదారత చూపిస్తోంది. ఇది కావాల్సిందే. ఎందుకంటే ప్రజలు కష్టాలలో ఉన్నారు. ఏపీ మూలాలు నిండుగా ఉన్న టాలీవుడ్ ఇపుడు కష్టకాలంలో ముందుకు వచ్చి ఈ విధంగా ప్రజలకు సాయపడడం మంచి పరిణామమే.

అదే సమయంలో గత అయిదేళ్ళ వైసీపీ ఏలుబడిలో టాలీవుడ్ ఈ విధంగా స్పందించిన దాఖలాలు లేకపోవడం పట్ల చర్చ అయితే సాగుతోంది. ఆనాడూ వరదలు వచ్చాయి. ఏపీ ఎంతో ఇబ్బంది పడింది. కానీ అపుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో టాలీవుడ్ పూర్తి సైలెంట్ అయింది అన్న కామెంట్స్ నెటిజన్లు పెడుతున్నారు

ఆనాడూ ఈనాడూ ఏపీలో ఉన్నది ప్రజలే. వారి మద్దతుతోనే వారు ఇచ్చే సపోర్టుతోనే టాలీవుడ్ ఇంతలా ఎదిగింది. మరి ఆనాడు మాత్రం ఏపీని ఇంత పట్టించుకోలేదు టాలీవుడ్ ఇపుడు మాత్రం బాగానే ముందుకు వచ్చింది. సాయం చేయడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తోంది

అంతే కాదు టాప్ టూ బాటమ్ టాలీవుడ్ హీరోలు కూడా విరాళాలు తమకు తోచిన తీరున ఇచ్చారు. ఇదంతా చూసిన వారికి కలిగే సందేహం మాత్రం టాలీవుడ్ కి ఏపీ ప్రజలతో సంబంధమా లేక ఏపీలో రాజకీయాలతో సంబంధమా అన్నది. ఏపీలో ఒక పార్టీ ప్రభుత్వం ఉంటే ఒకలా మరో ప్రభుత్వం ఉంటే ఇంకోలా వ్యవహరించడం తగునా అన్న చర్చ అయితే సాగుతోంది.

మొత్తం మీద చూస్తే టాలీవుడ్ నుంచి మంచి మద్దతు లభిస్తోంది. ఇలాంటి విపత్తు సమయంలో సాయం చేసేందుకు టాలీవుడ్ ఎపుడూ ముందుకు వస్తుందని నిర్మాతలు చెబుతున్నారు.

మేము ఈ స్థాయికి రావడానికి ప్రజల ఆదరణ కారణం అంటున్న నిర్మాతలు గతంలో అయిదేళ్ల పాటు ఈ మాటలను మరచారా అని కూడా అంటున్నారు. ఎపుడూ ప్రభుత్వాలకు అండగా తాము ఉంటామని చెబుతున్న వారు ఆనాడు మాత్రం శీతకన్ను వేశారని విమర్శలు అయితే ఉన్నాయి.

మొత్తం మీద చూస్తే నిర్మాతలు ఈ విధంగా స్పందించడం మంచిదే కానీ ప్రజలు ఎపుడూ ప్రజలే. వారికి ఇబ్బందులు ఎపుడూ ఒకే విధంగా ఉంటాయి. రాజకీయ పార్టీ మారిందని కొత్త ప్రభుత్వం వచ్చిందని ప్రజల కష్టాలు మారవు. అందువల్ల ఇదే తీరున సాయం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేసేందుకు నిర్మాతలు ముందుకు రావాల్సి ఉంది అని అంటున్నారు. అపుడే వారు చేసే సాయం మీద ఇంతకు రెట్టింపు గౌరవం పెరుగుతుందని కూడా అంటున్నారు.

రాజకీయాలు ప్రజలు ఎపుడూ పట్టించుకోరు. ఓటేసిన తరువాత వారే మరచిపోతారు. అలాంటి ప్రజలతో అనుసంధానం అయి సినిమాలు తీసే నిర్మాతలకు కానీ వివిధ రంగాల ప్రముఖులకు కానీ అది అవసరం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలలో వరద బాధితులను ఆదుకోవడానికి టాలీవుడ్ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధిత ప్రాంతాలలో ఇబ్బందుల మీద ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లుగా టాలీవుడ్ ప్రకటించింది.

ఆ కమిటీ ఇచ్చే నివేదికను ఆసరాగా చేసుకుని ఎక్కడ ఏ రకమైన సాయం చేయాలన్నది నిర్ణయించి చేస్తామని టాలీవుడ్ పేర్కొంది. ఇక అన్ని థియేటర్ల వద్ద విరాల సేకరణతో పాటు వస్తువులను సేకరించాలని కూడా నిర్ణయం తీసుకుంది.

ఈ విధంగా ఫిల్మ్ చాంబర్ నిర్ణయం తీసుకున్నా వ్యక్తిగత హోదాలో కొందరు నిర్మాతలు విరాళాలను ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి పాతిక లక్షల రూపాయలను తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రకటించింది. అలాగే, తెలుగు నిర్మాతల మండలి చెరి పది లక్షల రూపాయలను ప్రకటించింది.