Begin typing your search above and press return to search.

టాలీవుడ్ వణుకుతోందా ?

నిజానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా ఆంధ్రాకు చెందినవారే వారి మూలాలు అన్నీ ఏపీలోనే ఉన్నాయి. అటువంటిది వారు మాత్రం బయటకు వచ్చి ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడం లేదు.

By:  Tupaki Desk   |   20 April 2024 12:30 AM GMT
టాలీవుడ్ వణుకుతోందా ?
X

సినిమా రంగానికి రాజకీయ రంగానికి మధ్య సున్నితమైన తెర ఎపుడో కట్ అయింది. సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి వచ్చి రాణిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాదిన సినీ ప్రముఖులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండడం కొన్ని దశాబ్దాలుగా వస్తోంది. ఒక ఎన్టీయార్ ఎమ్జీయార్ జయలలిత కరుణానిధి వంటి వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాణించిన వారే.

ఆ తరువాత కాలంలో సీఎం సీటు దాకా రాకపోయినా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా నెగ్గి కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన సినీ రంగ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ఇక ఏపీలో చూస్తే మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ రాజకీయాలతో దశాబ్దాలుగా పెనవేసుకుని పోతున్న నేపథ్యం ఉంది.

ఎన్టీఆర్ కుమారుడు బాలయ్య అయితే ఎమ్మెల్యేగా రెండు సార్లు నెగ్గారు.ఈసారి పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీకి వెళ్లాలని పట్టుదలగా ఉన్నారు. మరి ఈ నేపధ్యం నుంచి చూసినపుడు సినీ రంగం నుంచి ఏపీ వైపు దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉందనే అంటున్నారు. కానీ గడచిన కొద్ది రోజులుగా చూస్తే టాలీవుడ్ ఫుల్ సైలెంట్ గా ఉంది. అసలు తనకేం సంబంధం అన్నట్లుగా చోద్యం చూస్తోంది.

నిజానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా ఆంధ్రాకు చెందినవారే వారి మూలాలు అన్నీ ఏపీలోనే ఉన్నాయి. అటువంటిది వారు మాత్రం బయటకు వచ్చి ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడం లేదు. దీని కంటే కాస్తా ముందుగా అంటే నాలుగు నెలల క్రితం జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కూడా టాలీవుడ్ నుంచి ఎవరూ బయటకు వచ్చింది లేదు, ప్రచారం చేసింది లేదు.

అంతా గప్ చుప్ గానే ఉన్నారు. దానికి కారణం ఏంటి అన్నది తెలియడం లేదు కానీ ఆ మధ్యన ఒక బడా ప్రొడ్యూసర్ మీడియాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదు అని. చంద్రబాబు అరెస్ట్ ని ఎందుకు ఖండించలేదు అన్న దానికి ఆయన ఇచ్చిన రియాక్షన్ ఇది. తమకు అన్ని రాజకీయ పార్టీలు సమానమే అన్నారు. అంతే కాదు.తమకు సినీ రంగం ప్రయోజనాలే ముఖ్యం అని అన్నారు.

ఒకవేళ ఎవరైనా వ్యక్తిగతంగా తమ రాజకీయ ఇష్టాలు ప్రకటించుకుంటే అది వేరు కానీ టాలీవుడ్ లో ఉన్న సంఘాలు మాత్రం ఎవరికీ మద్దతుగా నిలిచేది ఉండదని కూడా తేల్చి చెప్పేశారు. దీనిని బట్టి చూస్తే అర్ధం అయ్యేది ఒక్కటే టాలీవుడ్ సైలెంట్ స్పెక్టేటర్ గానే ఉంటుందని, జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తుంది అని.

నిజానికి ఏపీలో రాజకీయాలు చూస్తే కూడా బొత్తిగా అర్ధం కావడంలేదు. ఎవరు అధికారంలోకి వస్తారో కూడా తెలియడం లేదు. ఎవరు వచ్చినా తక్కువ సీట్లతోనే అని అంటున్నారు. ఇంత టైట్ గా ఫైట్ సాగుతున్నపుడు వన్ సైడెడ్ గా రాజకీయం లేనపుడు ఏ వైపు వచ్చి సపోర్ట్ తీసుకుని ప్రచారంలోకి దిగితే రేపు రివర్స్ అయితే ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోందిట.

దాంతోనే టాలీవుడ్ లో సినీ ప్రముఖులు అంతా సైలెంట్ గా ఉన్నారు అని అంటున్నారు. ఇక ఒక పార్టీకి మద్దతు ఇచ్చి వేరే పార్టీ అధికారంలోకి వస్తే అపుడు ఏ సమస్యకు అయినా ఆ ప్రభుత్వం దగ్గరకు వెళ్ళేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని కూడా ఆలోచిస్తున్నారుట. 2019లో అయితే టాలీవుడ్ నుంచి ప్రధాన పార్టీలకు సపోర్ట్ లభించింది.

కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అంతా సైలెంట్ అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా మనిషి కాబట్టి ఆయనకు మద్దతుగా జబర్దస్త్ బ్యాచ్ మాత్రం అక్కడక్కడ ఏపీలో తిరుగుతోంది. అంతకు మించి ప్రముఖులు ఎవరూ బయటకు రావడం లేదు. బాహాటంగా మద్దతు ఇవ్వడంలేదు. అసలు మాకు ఎందుకు ఈ రాజకీయాలు అని కొందరు అంటున్నారు.

మరి కొందరు మాత్రం బయటకు వచ్చి తమకు ఇష్టమైన పార్టీకి మద్దతు ఇవ్వాలని అనుకున్నా ఏమో రేపు ఏమి జరుగుతుందో తాము సపోర్ట్ చేసిన పార్టీ పవర్ లోకి రాకపోతే తాను డైరెక్ట్ గా కార్నర్ అవుతామని కూడా జడిసి కూర్చుకుంటున్నారుట.

నిజానికి సామాజిక వర్గాల పరంగా చూస్తే సినీ రంగంలో ఏ రాజకీయ పార్టీకి ఎంత మద్దతు ఉంటుంది అన్నది సగటు ప్రజానీకానికి తెలుసు. ఏ నిర్మాత ఏ హీరో ఏ టెక్నీషియన్ ఎటు వైపు అన్నది తెలుసు. కానీ వారు నోరు విప్పి ముద్ర వేయించుకోవడానికే జంకుతున్నారు అని అంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో సినీ తళతళలు అయితే పెద్దగా ఉండకపోవచ్చు అని అంటున్నారు.