పాతాళానికి పడిన టమాటా.. అమ్మకుండా పారబోసేశారు
రైతును లక్షాధికారిని చేసిన టమాటా ఈ రోజున కన్నీళ్లు కార్పిస్తోంది. భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో టమాటాల్ని పెద్ద ఎత్తున పండించారు రైతులు.
By: Tupaki Desk | 8 Sep 2023 4:40 AM GMTమొన్నటివరకు కాసుల వర్షం కురిపిస్తూ.. రైతును లక్షాధికారిని చేసిన టమాటా ఈ రోజున కన్నీళ్లు కార్పిస్తోంది. భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో టమాటాల్ని పెద్ద ఎత్తున పండించారు రైతులు. ఇప్పుడదే శాపంగా మారింది. కొన్ని రోజుల క్రితం వరకు కేజీ రూ.170 నుంచి రూ.200 వరకు పలికి టమాటాలు ఆ తర్వాత తగ్గటం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా పాతాళానికి పడిపోయింది. కేజీ టమాటా రూ.3లకు కూడా అమ్మేందుకు హోల్ సేల్ వ్యాపారులు ముందుకు రాకపోవటంతో పంట పండించిన రైతుల కడుపు మండిపోతోంది.
దీంతో.. వారు తాము తీసుకొచ్చిన వందల కేజీల టామాటాలను రాశులుగా పోసేసి.. వదిలేసి వెళ్లిపోతున్నారు. దీంతో.. పశువులకు గ్రాసంగా మారాయి. నంద్యాల జిల్లా ప్యాపిలి మార్కెట్ లో టమాటాకు ధర పలకపోవటంతో రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ధరలు భారీగా తగ్గిపోవటం.. రైతుల వద్ద పంట తీసుకునేందుకు వ్యాపారుస్తులు పెడుతున్న కండీషన్లతో.. పంటను అమ్మే కన్నా.. వదిలేసి వెళ్లిపోవటం ఉత్తమం అన్నట్లుగా వారి పరిస్థితి మారింది.
తాము పండించిన పంటను కోసి.. రవాణా ఛార్జీలతో హోల్ సేల్ మార్కెట్ కు తీసుకొస్తే.. పంట ఖర్చులు తర్వాత కోత ఖర్చులు కూడా రాని దుస్థితి నెలకందని వాపోతున్నారు. కర్నూలు జిల్లాలోనే కాదు.. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్ లోనూ టమాటా ధరలు భారీగా తగ్గిపోయాయి. దీంతో.. రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.