45 రోజుల్లో రూ.4 కోట్లు... ఏపీలో టమాటా రైతు రికార్డ్!
రోజువారీ కూరల్లో వాడే టమాటా ధరలు ఇప్పుడు పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. కూరగాయల మార్కెట్ లోకి వెళ్లిన సామాన్యుడు టమాటాలవైపు చూడటానికి కూడా సంశయిస్తున్నాడన్నా అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో రికార్డ్ స్థాయి ధరకు చేరింది.
By: Tupaki Desk | 30 July 2023 10:45 AM GMTరోజువారీ కూరల్లో వాడే టమాటా ధరలు ఇప్పుడు పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. కూరగాయల మార్కెట్ లోకి వెళ్లిన సామాన్యుడు టమాటాలవైపు చూడటానికి కూడా సంశయిస్తున్నాడన్నా అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో రికార్డ్ స్థాయి ధరకు చేరింది. ఈ సమయంలో కొంతమంంది రైతుల పంట పండుతోంది!
అవును... గత రెండు నెలలుగా దేశవ్యాప్తంగా టమాటో ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. గతవారం కాస్త తగ్గినట్టు కనిపించిన టమాట ధరలు.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొంత మంది రైతులను టమాటాలు కోటీశ్వరులను చేశాయి. ఇందులో భాగంగా ఏపీకి చెందిన రైతు కోటీశ్వరుడయ్యారు.
వివరాళ్లొకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో టమాటా రైతు మురళి జాక్ పాట్ కొట్టాడు. టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అతడి అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. టమాటాల పుణ్యమాని 45 రోజుల్లోనే అక్షరాలా రూ.4 కోట్లు సంపాదించాడు. ఆయన మదనపల్లెలోని టమాటా మార్కెట్ లోనే కాకుండా.. పొరుగున ఉన్న కర్ణాటకకు కూడా టమాటాలను విక్రయించాడు.
మురళి దంపతులు ఏప్రిల్ లో కరకమండ్ల గ్రామంలోని 22 ఎకరాల భూమిలో టమోటా సాగు చేశారు. పంట ఏపుగా పెరగడంతో గత 45 రోజులలో 40,000 టమాట బాక్సులను విక్రయించారు. ఇలా పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో గతంలో ఇదే కూరగాయ సాగు వల్ల చేసిన రూ.1.5 కోట్ల అప్పులు తీర్చగలిగామని రైతు చెబుతున్నారు.
ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా బాగుండడంతో ఈసారి దిగుబడి బాగా వచ్చిందని చెప్పిన మురళి... టమాటా ధరలు బాగా పెరగడం అతిపెద్ద మలుపుగా మారిందని అన్నాడు. టమాటా ఇంత పెద్ద ఆదాయాన్ని ఇస్తుందని తానెప్పుడూ ఊహించలేదని మురళీ చెప్పుకొచ్చాడు.
కాగా, తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఒక రైతు గత నెల రోజులుగా టమోటాలు అమ్మడం ద్వారా రూ. 2 కోట్లు సంపాదించిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ కు చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డి... టమాట ధర ఆకాశాన్నంటడంతో కోట్లు సంపాదించాడు.