ప్రపంచ వృద్ధ మహిళ ఇకలేరు
వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మరణం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు.
By: Tupaki Desk | 4 Jan 2025 2:26 PM GMTప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా భావిస్తున్న టోమికో ఇతోకా మరణించారు. జపాన్ కి చెందిన టోమికో ఇతోకా డిసెంబర్ 29న కన్నుమూసినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. టోమికో ఇతోకా వయసు 116 ఏళ్లుగా చెబుతున్నారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మరణం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నివాళులర్పిస్తున్నారు.
జపాన్ లోని ఒసాకోలో 1908 మే 23న టోమికో ఇతోకా జన్మించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం గత ఏడాది స్పెయిన్ దేశానికి చెందిన 117 ఏళ్ల బ్రన్యాస్ మరణంతో అత్యంత వృద్ధ మహిళగా టోమికో ఇతోకా రికార్డు కైవసం చేసుకున్నారు. గతేడాది మేలో ఇతోకా పుట్టిన రోజు వేడుకలను పెద్దఎత్తున చేపట్టారు. స్థానికంగా ఉన్న పలువురు ప్రముఖులు ఆమెను కలిసి పుష్ఫగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు.
టోమికో ఇతోకాకు అరటి పళ్లు అన్నా, జపాన్ దేశంలో ఎక్కువగా లభించే 'కాల్పిస్' అనే డ్రింక్ అన్నా చాలా ఇష్టపడతారట. విద్యార్థి దశలో వాలీబాల్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న ఇతోకా, సుమారు 3,067 మీటర్ల ఎత్తైన ఆన్ టేక్ పర్వతాన్ని రెండు సార్లు అధిరోహించి రికార్డు సాధించారు. 20 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్న ఇతోకాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1949లో ఆమె భర్త చనిపోయినప్పటి నుంచి 'నర' అనే నగరంలో ఒంటరిగా జీవిస్తున్నారు. జెరొంటాలజీ రీసెర్చ్ గ్రూప్ వెల్డడించిన వివరాల ప్రకారం ఇతోకా మరణంతో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా కెనబర్రో లుకాస్ అనే నన్ నిలిచారు. ఈమె వయసు కూడా ప్రస్తుతం 116 ఏళ్లేనని చెబుతున్నారు. బ్రెజిల్కి చెందిన ఈమె ఇతోకా కంటే కేవలం 16 రోజులు మాత్రమే చిన్నవారట.