Begin typing your search above and press return to search.

రేపే బీఆరెస్స్ మేనిఫెస్టో... కొత్త పథకాలపై అంచనాలివే!

ఈ నేపథ్యంలో... ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగింపుతో పాటు కొత్తగా... రైతులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టడంతోపాటు, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా మేనిఫెస్టో ఉండొచ్చని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Oct 2023 8:14 AM GMT
రేపే బీఆరెస్స్  మేనిఫెస్టో... కొత్త పథకాలపై అంచనాలివే!
X

తెలంగాణ ఎన్నికల సందడి ఇప్పటికే మొదలైంది. ఇందులో భాగంగా గతకొన్ని రోజులుగా రసవత్తర ఘట్టాలు తెరపైకి వస్తున్నాయి. పైగా సుమారు మూడు వారాలకు పైగా కేసీఆర్ కనిపించకపోవడంతో బీఆరెస్స్ శ్రేణుల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా కేసీఆర్ రెడీ అయ్యారు. ఇందులో భాగంగా రావడం రావడం మ్యానిఫెస్టోతో రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తుంది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పోలింగ్ ముహూర్తం ఫిక్సయిన అనంతరం.. ఆఫ్టర్ స్మాల్ గ్యాప్ ఆదివారం నుంచి గులాబీ బాస్‌ రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగా... అక్టోబర్ 15వ తేదీన బీఆరెస్స్ మేనిఫెస్టోను ప్రకటించడమే కాకుండా హుస్నాబాద్‌ సభతో ఎన్నికల సమరశంఖం పూరించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో... బీఆరెస్స్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొందని అంటున్నారు.

పైగా రేపు విడుదల చేయబోయే మేనిఫెస్టోపై ఇప్పటికే కేటీఆర్ లీకులు ఇవ్వడంతో అంచనాలు పెరిగిపోతున్నాయని అంటున్నారు. దీంతో ఇప్పటివరకూ ప్రకటించిన పథకాలే కాకుండా.. సర్ప్రైజింగ్ పథకాలు కూడా ఉండొచ్చనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. మరోపక్క హుస్నాబాద్‌ సభలో కేసీఆర్ చేయబోయే ప్రసంగంపైనా అసక్తి నెలకొందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... ఇప్పటికే అమలవుతోన్న పథకాలు కొనసాగింపుతో పాటు కొత్తగా... రైతులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టడంతోపాటు, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా మేనిఫెస్టో ఉండొచ్చని అంటున్నారు. ఇదే సమయంలో రైతుబంధు, రైతు బీమా నగదు పెంచే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

ఇదే సమయంలో దళితబంధు, బీసీ బంధు, మైనారిటీ బంధుపై మరింత ఫోకస్‌ పెట్టడంతోపాటు.. యువత, గృహిణులు, ఒంటరి మహిళల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చే దిశగా బీఆరెస్స్ పెద్దలు మేనిఫెస్టోపై కుస్తీలు పడ్డారని చెబుతున్నారు.

ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ లో ఆదివారం జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. అందులో భాగంగా ఇప్పటికే హెలిప్యాడ్ నిర్మాణం పూర్తయిందని, సభాస్థలి వేదిక పనులు పూర్తవుతాయని స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు. జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

కాగా... 2014, 2018 లో రెండుసార్లు హుస్నాబాద్ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని బహిరంగ సభ ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

మరోపక్క... గురువారం రాత్రి పార్టీ విడుదల చేసిన జాబితా ప్రకారం, ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన తనయుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా ప్రస్తుతం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌ రావును ఇన్‌ ఛార్జ్‌ గా నియమించారు.