అమెరికాలో టోర్నడోల బీభత్సం... పెరిగిన మృతుల సంఖ్య!
అమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్ లను టోర్నడోలు కుదిపేశాయి.
By: Tupaki Desk | 28 May 2024 5:54 AM GMTఅమెరికాలోని టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్ లను టోర్నడోలు కుదిపేశాయి. ఇందులో భాగంగా... మూడు చోట్లా భారీ విధ్వంసం చోటుచేసుకుంది. గాలుల తీవ్రతకు ఇళ్లు కూలడం, చెట్లు పడిపోవడం వంటి ఘటనల కారణంగా 200 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరో 100 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని చెబుతున్నారు.
అవును... అమెరికాను టోర్నడోలు కుదిపేశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అగ్రరాజ్యాన్ని వణికించేశాయి. టెక్సాస్, ఒక్లహామా, అర్కన్సాస్ సహా 16 రాష్ట్రాల్లో ఈ టోర్నడోల వల్ల సుమారు 6 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అంటున్నారు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి.
మరోవైపు 28 మందికి పైగా చనిపోయారని తెలుస్తుంది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో తుఫాన్ ధాటికి అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. అదేవిధంగా... జార్జియా, సౌత్ కరోలినాలోని కొన్ని ప్రాంతాలు తీవ్ర తుఫాన్ హెచ్చరికలో ఉన్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది.
ఇదే క్రమంలో... వాతావరణ సేవ కూడా ఒహియో, టేనస్సీ లోయలలో సుడిగాలి గురించిన హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో... టోర్నడోల కారణంగా బలమైన గాలులు, సుమారు బేస్ బాల్ అంత పెద్ద వడగళ్ళు, కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తుఫాను కేంద్రం వెల్లడించింది!