ఏపీలో టఫ్ ఫైట్...ఈ అంచనా ఎవరిది...!?
ఏపీలో భీకరమైన పోరు సాగనుంది అని తేల్చేస్తున్నాయి.
By: Tupaki Desk | 24 March 2024 6:18 PM ISTఏపీలో టఫ్ ఫైట్ ఈసారి జరగబోతోందా. వేవ్ అన్నది ఏ ఒక్క పార్టీకీ లేదా అంటే ఇప్పటిదాకా వచ్చిన అనేక ప్రైవేట్ సంస్థలు లోకల్ జాతీయ సర్వేలు అదే చెబుతున్నాయి. ఏపీలో భీకరమైన పోరు సాగనుంది అని తేల్చేస్తున్నాయి.
ఏపీలో ఏవరు గెలిచినా లేక ఓడినా పెద్దగా తేడా ఉండదు అని అంటున్నారు. ఓడిన వారు మ్యాజిక్ ఫిగర్ 88కి ఒక పది పదిహేను సీట్ల అవతల ఉంటే గెలిచిన పార్టీ కానీ కూటమి కానీ అధికారానికి సరిపడా మెజారిటీతో ఒడ్డున పడుతుందని అంటున్నారు.
ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఇలాగే ఉన్నాయని అంటున్నారు. ఏపీలో అధికార వైసీపీకి తనదైన ఓటు బ్యాంక్ ఉంది. అలాగే సంక్షేమ పధకాల వల్ల కొత్తగా లభించిన ఓటు ఉంది. అదే టైం లో ప్రభుత్వంగా అయిదేళ్ల పాటు పాలన చేసిన పార్టీగా యాంటీ ఇంకెంబెన్సీ కూడా ఉంది. అది పట్టణాల్లో తీవ్ర స్థాయిలో ఉంటే గ్రామీణంలో తక్కువగా ఉంది.
ఏది ఏమైనా అయిదేళ్ల వైసీపీ పాలనలో కొన్ని వర్గాలు ఇబ్బందిగా ఫీల్ అయి వ్యతిరేకం అయ్యాయని అంటున్నారు. అదే విధంగా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి లేకపోవడం వల్ల విద్యావంతులు, చదువరులు మేధావులు దూరం జరిగారు అని అంటున్నారు. ఇక పోలవరం రాజధాని వంటి అంశాలు ఈసారి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని అంటున్నారు.
అదే టైం లో వైసీపీ హయాంలో ఢీ అంటే ఢీగా ఏపీ రాజకీయాలు సాగాయి. వాటి వల్ల సంభవించే లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా సగటు ప్రజానీకం కొంత వ్యతిరేకించే పరిస్థితి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వైసీపీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే లేదు అన్నది ఒక స్థూలమైన విశ్లేషణ.
ఇక టీడీపీ కూటమి విషయానికి వస్తే ప్రతిపక్షాలు అన్నీ కట్టకట్టుకుని మరీ ఒక్కటి అవుతున్నాయి. ఇది తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. చంద్రబాబు అవతల వైపు కూటమికి నాయకత్వం వహించడం ఆయన అనుభవం, ఆయన పాలనా ఇవన్నీ కూడా కూటమికి ప్లస్ పాయింట్లు అవుతున్నాయి. బీజేపీ పట్ల ఏపీలో కొన్ని సెక్షనల్లో వ్యతిరేకత ఉండడం కొంత మైనస్ అయినప్పటికీ దేశంలో మరోసారి అధికారంలోకి వచ్చే పార్టీగా అర్బన్ సెక్షన్, అగ్ర వర్ణాలలో ఆ పార్టీ పట్ల సానుకూలత ఉంది అని అంటున్నారు.
ఇక యువతలో జనసేనకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. అలాగే బలమైన సామాజిక వర్గంలో కూడా జనసేన పట్ల ఈసారి మొగ్గు బాగా కనిపిస్తోంది. ఇలా మూడు పార్టీల కలయిక వైసీపీకి ధీటైన సవాల్ గానే ఉంది అని అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు వైసీపీ వర్సెస్ కూటమిగా ఏపీలో రసవత్తరమైన రాజకీయ పోరు సాగుతోంది అని అంటున్నారు.
ఇపుడున్న పరిస్థితులలో ఎవరికి అధికారం వస్తుంది అంటే రెండు వైపులా గట్టిగానే ఉంది. అదే విధంగా ఎవరినీ తక్కువ చేయడానికి లేదనే అంటున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు సైతం ఏపీలో టఫ్ ఫైట్ ఉంటుందని అంచనా వేశాయా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో భీకర పోరు ఉందని ఎవరికీ పూర్తి స్థాయిలో మొగ్గు లేదన్న ఇంటలిజెన్స్ నివేదికలను బట్టే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు.
ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్నా అదే సమయంలో వైసీపీని పూర్తి స్థాయిలో వ్యతిరేకించేలా కేంద్ర బీజేపీ చర్యలు ఉండబోవని అంటున్నారు. వైసీపీ రేపటి రోజున ఏపీలో గెలిచినా లేక ఎక్కువ ఎంపీ సీట్లు తెచ్చుకున్నా తమకు అనుకూలం చేసుకునే ఎత్తుగడతోనే కేంద్ర బీజేపీ ఉంది అని అంటున్నారు. ఏపీలో వార్ వన్ సైడ్ గా ఉంటే కనుక బీజేపీ ఈపాటికే ఏపీలో జగన్ సర్కార్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఆ మిగిలిన పని కాస్తా పూర్తి చేసేది అని అంటున్నారు.
మొత్తానికి అయితే ఈ రోజుకీ అధికారం ఎవరి పక్షం అయినా కావచ్చు. ఎవరు అయినా గెలవవచ్చు. బట్ భారీ నంబర్ తో మాత్రం ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని అంటున్నారు. ఏతా వాతా చూసుకుంటే కనుక బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీ రాజకీయాన్ని చాలా జాగ్రత్తగా చేస్తోంది అని అంటున్నారు. కేంద్ర బీజేపీకి ఏపీలోని మొత్తం పాతిక ఎంపీ సీట్లు కావాలి. అదే సమయంలో ఇండియా కూటమి వైపు ఎవరూ జారిపోకూడదు. ఆ విధంగా కాషాయం పార్టీ ఆలోచనలు ఉండబట్టే ఏపీలో విచిత్రమైన రాజకీయం సాగుతోంది అని అంటున్నారు.