అమెరికాలో భారత టెకీలకు గడ్డు కాలం
కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెంది హెచ్1బీ వీసాపై పనిచేస్తున్నవారు ఇందులో ఉన్నారు.
By: Tupaki Desk | 18 Oct 2023 8:12 AM GMTకోవిడ్ సంక్షోభ ప్రభావాలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దుష్ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం తదితర కారణాలతో సాధారణ ఐటీ కంపెనీలతోపాటు దిగ్గజ ఐటీ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. దీనివల్ల ఎక్కువ ప్రభావితమయ్యింది భారతీయ టెకీలే. ఎందుకంటే అమెరికాలో భారతీయ టెకీలే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సహజంగానే ఉద్యోగాలు కోల్పోయింది కూడా మనవాళ్లే.
అయితే ఇప్పుడు మరో గండం భారతీయ టెకీల మీద వేలాడుతోంది. అమెరికాలో ఉద్యోగం చేసేవారిలో ఎక్కువ మంది హెచ్1బీ వీసాపైన పనిచేస్తున్నవారే. ఇప్పుడు ఉద్యోగం పోయినవారు అమెరికాను వదిలిపోవాల్సి ఉంటుంది. ఉద్యోగం ఉన్నంతవరకే హెచ్1బీ వీసా అమల్లో ఉంటుంది. ఉద్యోగం లేకపోతే వీసా కాలపరిమితి కూడా తీరిపోతుంది.
ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయినవారు వీలైనంత త్వరగా ఉద్యోగాలు తిరిగి పొందలేకపోతే అమెరికాను విడిచిపోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు చెంది హెచ్1బీ వీసాపై పనిచేస్తున్నవారు ఇందులో ఉన్నారు. విదేశీయులు సైతం తమ ఉద్యోగాలను కోల్పోవడంతో వారికి సైతం హెచ్1బీ వీసా కాల పరిమితి ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన భారత టెకీలు త్వరగా మరో జాబ్ సంపాదించుకోవాలి. లేనిపక్షంలో అమెరికా వదిలి వెళ్లక తప్పదని అంటున్నారు. ఈ పరిస్థితి వారిని, వారి కుటుంబాలను తీవ్ర ఒత్తిడిలో పడేస్తోంది. ఇన్నాళ్లూ అమెరికాలో ఉండి ఇప్పుడు ఉన్నట్టుండి వెళ్ళిపోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఇప్పటికే అక్కడ ఇళ్లను కొనుక్కున్నవారు వాటిని అమ్మేయాల్సి ఉంటుంది. అలాగే పిల్లల చదువులు, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇన్నాళ్లు అమెరికాలో గడిపిన జీవితం మొత్తం తలకిందులవుతుందనే భయాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసా కలిగి ఉండి ఉద్యోగాలు కోల్పోయినవారు వీలైనంత త్వరగా వేరే కంపెనీల్లో ఉద్యోగాలు పొందే పనిలో ఉన్నారని అంటున్నారు. మరికొందరు హెచ్–1బీ వీసా విధానమే అన్యాయమని అంటున్నారు. ఈ విధానం ఉద్యోగులు, అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండింటినీ తీవ్రంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు. నిపుణులు సైతం ఈ విధానం సరికాదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాలో ఇమ్మిగ్రేషన్ విధానాన్ని మార్చాలనేదానిపై డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఎలా మార్చాలి? ఇతర దేశాల నుంచి వచ్చే నైపుణ్యం కలిగిన వర్కర్లను ఇది ఎలా ప్రభావితం చేస్తుందనే దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.