Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ అరెస్ట్... కీలక విషయాలు లేవనెత్తిన మహేష్!

చట్టం దృష్టిలో అంతా సమానమేనని రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ రాజకీయ విమర్శల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

By:  Tupaki Desk   |   15 Dec 2024 9:55 AM GMT
అల్లు అర్జున్ అరెస్ట్... కీలక విషయాలు లేవనెత్తిన మహేష్!
X

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించిన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్, నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం, హైకోర్టు బెయిల్ ఇవ్వడం, అప్పటికే చంచల్ గూడ జైలుకు తరలించబడటం, బెయిల్ వచ్చినా పలు కారణాల వల్ల ఒక రాత్రంతా జైలులోనే ఉండటం, తర్వాత విడుదలవ్వడం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో.. అల్లు అర్జున్ అరెస్ట్ సినిమా ఇండస్ట్రీలో కంటే రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చర్చ తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా రియాక్షన్ వచ్చినట్లు కనిపించలేదు కానీ... రాజకీయ నాయకుల నుంచి మాత్రం ఘాటైన రియాక్షన్ వచ్చిందనే చర్చ బలంగా వినిపించింది.

ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్టును బీఆరెస్స్ నేతలు తీవ్రంగా ఘండించారు. ఈ వ్యవహారంపై కేటీఆర్, హరీష్ రావులు సర్కార్ పై ఫైరయ్యారు. ఇదే సమయంలో బీజేపీ నేతలు బండి సంజయ్, రాజాసింగ్ లు ఖండించారు! ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు.

ప్రధానంగా అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్టును ఖండించారు. మరోపక్క ఈ వ్యవహారంపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఇది అల్లు అర్జున్ కు తెలంగాణ సర్కార్ ఇచ్చిన రిటన్ గిఫ్ట్ అంటూ కామెంట్ చేశారు. ఈ సమయంలో టీపీసీసీ చీఫ్ కీలక విషయాలు లేవనెత్తారు.

అవును... అల్లు అర్జున్ అరెస్ట్ పై రకరకాల రాజకీయ విశ్లేషణలు వినిపిస్తుండగా.. బీఆరెస్స్, వైసీపీలు ఆ అరెస్ట్ ను ఖండించాయి. మరోపక్క.. ఈ అరెస్టులో మరో ఆలోచన ఏమీ లేదని.. చట్టం దృష్టిలో అంతా సమానమేనని రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ రాజకీయ విమర్శల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు.

ఇందులో భాగంగా... హీరో అల్లు అర్జున్ పై తమ ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేసిన మహేష్... ఆయన కారణంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోతే కూడా అరెస్ట్ చేయొద్దా.. అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు అని ప్రశ్నించారు! చనిపోయిన మహిళ గురించి బీఆరెస్స్ ఎందుకు చర్చించడం లేదని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమతో కాంగ్రెస్ కున్న సంబంధం ఈనాటిది కాదంటూ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా... తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావటానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణమని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. దీంతో.. ఈ విషయం మరో ఆసక్తికర చర్చకు దారితీసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.