Begin typing your search above and press return to search.

తెలివిగా ఆయనను రంగంలోకి దింపుతున్న రేవంత్‌!

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉంది

By:  Tupaki Desk   |   3 Sep 2023 12:33 PM GMT
తెలివిగా ఆయనను రంగంలోకి దింపుతున్న రేవంత్‌!
X

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉంది.. కాంగ్రెస్‌ పార్టీ. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఈ ఏడాది మే నెలలో అధికారంలోకి రావడంతో అదే మ్యాజిక్కును తెలంగాణలోనూ కొనసాగించాలనే లక్ష్యంతో ఆ పార్టీ ఉంది.

ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో వివిధ పార్టీల నుంచి భారీ ఎత్తున కీలక నేతలు కాంగ్రెస్‌ లో చేరుతున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీజేపీ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్‌ వంటివారు కాంగ్రెస్‌ లో చేరిపోయారు. అలాగే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా కాంగ్రెస్‌ లో చేరతారని టాక్‌ నడుస్తోంది.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి టికెట్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 119 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 1,000కి పైగా దరఖాస్తులు వచ్చాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో సహా కీలక నేతలంతా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. వడపోతల అనంతరం ఫైనల్‌ గా అభ్యర్థులను ప్రకటించనున్నారు.

ఈ నేపథ్యంలో రేవంత్‌.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ సాయాన్ని కోరారని తెలుస్తోంది. తాజాగా బెంగళూరు వెళ్లిన రేవంత్‌.. డీకే శివకుమార్‌ తో భేటీ అయ్యారు. డీకేకు ట్రబుల్‌ షూటర్‌ గా కాంగ్రెస్‌ పార్టీలో పేరుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో పీసీసీ అధ్యక్షుడిగా కీలక పాత్ర డీకే శివకుమార్‌ దే.

ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు డీకేను రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ లో ఉండాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌ లో ఉండి అసెంబ్లీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని విన్నవించినట్టు తెలుస్తోంది.

టికెట్ల కోసం భారీ ఎత్తున కాంగ్రెస్‌ నేతలు దరఖాస్తు చేసుకోవడం, కొన్ని చోట్ల కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కూడా దరఖాస్తు చేసిన నేపథ్యంలో రేవంత్‌ రెడ్డిపై అనేక ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నట్టు సమాచారం. సీట్లు రానివారు చివరకు రేవంత్‌ ను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా సీనియర్‌ నేతల నుంచి విమర్శలు తప్పకపోవు.

ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రేవంత్‌ రెడ్డి.. డీకే శివకుమార్‌ ను రంగంలోకి దించుతున్నట్టు టాక్‌ నడుస్తోంది. అసెంబ్లీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతోపాటు అభ్యర్థులను ఫైనల్‌ చేయాలని డీకేని కోరినట్టు చెబుతున్నారు.

డీకే శివకుమార్‌ పై కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్‌ గాంధీలతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు మంచి నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో డీకే అభ్యర్థులను ఫైనల్‌ చేస్తే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలెవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ముందుకు రారని.. ఒకవేళ కాంగ్రెస్‌ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా డీకే శివకుమారే ఫైనల్‌ చేశారు కాబట్టి కాంగ్రెస్‌ అగ్ర నేతల నుంచి పెద్దగా అభ్యంతరాలు ఉండబోవనేది రేవంత్‌ అభిప్రాయమని అంటున్నారు.

అందువల్లే డీకే శివకుమార్‌ ను రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌ కు ఆహ్వానించారని అంటున్నారు. అసెంబ్లీ టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. అభ్యర్థులను ఫైనల్‌ చేయాలని కోరినట్టు చెబుతున్నారు.