ఆ మాజీ మంత్రి విషయంలో రేవంత్ కు కలిసొచ్చిన టీడీపీ బంధం
ఎన్నికలకు మరో రెండున్నర నెలల సమయమే ఉన్న తెలంగాణలో రాజకీయాలు వేడెక్కడం మొదదైంది.
By: Tupaki Desk | 2 Sep 2023 3:30 PM GMTఎన్నికలకు మరో రెండున్నర నెలల సమయమే ఉన్న తెలంగాణలో రాజకీయాలు వేడెక్కడం మొదదైంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థులతో జాబితా కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ ఈ నెల రెండో వారం నాటికి అభ్యర్థులను వెల్లడించే చాన్సుందని అంటున్నారు. బీజేపీ కూడా తనదైన శైలిలో వెళ్తూ ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను రప్పించి సర్వే చేయించింది. అయితే, పార్టీలలో చేరికలు, వాటి నుంచి వైదొలగడాలకు ఇది సరైన సమయం. జంపింగ్ లు మహా జోరుగా సాగే సీజన్. టికెట్ రాని అభ్యర్థులు అసమ్మతి వ్యక్తం చేయడం వారిని బుజ్జగించే ప్రయత్నాలు ఫలించకపోవడం వంటివి పెద్దఎత్తున సాగుతుంటాయి.
ఆ చేరిక పెద్ద మలుపేనా?
ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ఏర్పడినాక కూడా మంత్రిగా పనిచేసిన నాయకులు కొందరే ఉన్నారు. అందులోనూ ముగ్గురు సీఎంల వద్ద మంత్రిగా పనిచేసినవారు అరుదు. ఇంతేగాక ఒకే జిల్లాలోని మూడు వేర్వేరు నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ప్రత్యేకత ఆయన సొంతం. ఉమ్మడి జిల్లా అంతటా పట్టున్న అలాంటి నాయకుడు ఏ పార్టీకైనా బలం. కానీ, ఆయనకు టికెట్ రాకపోవడంతో పార్టీ మారక తప్పని పరిస్థితి వచ్చింది. ఇంకేం ఈ అవకాశాన్ని ప్రత్యర్థి పార్టీ అందిపుచ్చుకుంది.
స్వయంగా వెళ్లి ఆహ్వానించి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీని బలోపేతం చేసి.. బీఆర్ఎస్ ను విస్తరించిన ఘనత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుది. 2015లో బీఆర్ఎస్ లో చేరిన ఆయన మంత్రి కూడా అయ్యారు. పాలేరు ఉప ఎన్నికలో కనీవినీ ఎరుగని రికార్డుతో గెలిచారు. కానీ, 2018లో అనూహ్యంగా ఓడిపోయారు. అప్పటినుంచి బీఆర్ఎస్ లో ప్రాధాన్యం తగ్గింది. కొన్ని నెలల కిందట సీఎం కేసీఆర్.. తుమ్మలను వెంటబెట్టుకుని బహిరంగ సమావేశంలో పాల్గొన్నప్పటికీ తాజాగా ఆయనకు టికెట్ దక్కలేదు. అయినప్పటికీ తుమ్మల ఎలాగైనా పోటీ చేస్తానని ప్రకటించారు. కాగా, ఇదే చాన్సుగా భావించిన టీపీసీసీ అధ్యక్షుడు తుమ్మలను స్వయంగా ఆయన ఇంటికెళ్లి కలిశారు. తుమ్మల వంటి బలమైన నేత చేజారకుండా ఇక్కడ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారు. టీపీసీసీ చీఫ్ స్థాయి వ్యక్తి నేరుగా ఆహ్వానించడంతో తుమ్మల ఖుషీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమని స్పష్టమైంది.
ఆనాటి అనుబంధంతో
రేవంత్ రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్సీగా టీడీపీ నుంచే మొదలైంది. అంతకుముందు జడ్పీటీసీగా నెగ్గినప్పటికీ.. అందులో పలు పార్టీల సహకారం ఉంది. కాగా, టీడీపీలో ఎమ్మెల్సీ అయిన రెండేళ్లకే 2009లో ఎమ్మెల్యేగానూ కొండగల్ నుంచి గెలిచారు రేవంత్. ఆ సమయంలో టీడీపీలో చురుగ్గా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పార్టీ స్టాండ్ ను గట్టిగా వినిపించారు. అయితే, రాష్ట్రం ఏర్పడ్డాక టీడీపీకి పెద్దగా మనుగడ లేకపోవడంతో రేవంత్ 2018లో కాంగ్రెస్ లో చేరారు. నాలుగేళ్ల వ్యవధిలోనే పీసీసీ అధ్యక్షుడయ్యారు. ఇక టీడీపీలో ఉండగా ఏర్పడిన పరిచయాలు ఆయన కాంగ్రెస్ లోకి వచ్చాక కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తుమ్మలను చొరవచూపి పార్టీలోకి తీసుకురాగలిగారు. ఈ పరిణామం ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ కు బాగా మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.