ఆ ప్రాజెక్టులో కేసీఆర్ లక్ష కోట్లు తిన్నారు: రేవంత్
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
By: Tupaki Desk | 22 Oct 2023 4:04 PM GMTతెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే కేసీఆర్ పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. తాజాగా కేసీఆర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్ కుంగిపోయిన ఘటనకు కేసీఆర్ కుటుంబమే కారణమని షాకింగ్ కామెంట్లు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీ బ్యారేజ్ దగ్గర పిల్లర్ కుంగిపోవడానికి కేసీఆర్ కుటుంబ అవినీతి కారణమని, అందులో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ ప్రమాదం జరిగిందని రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లను కేసీఆర్, కాంట్రాక్టర్లు దోచుకున్నారని రేవంత్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తాను డిమాండ్ చేస్తున్నానని రేవంత్ అన్నారు. మేడిగడ్డ ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి, గవర్నర్, ఈసీ విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి కోరారు. మేడిగడ్డ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఈసీకి లేఖ రాస్తామని, కేటీఆర్, హరీశ్ రావు కూడా తమతో కలిసి మేడిగడ్డకు రావాలని డిమాండ్ చేశారు.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 15వ స్తంభం నుంచి 20వ పిల్లర్ వరకు వంతెన వంగి కనిపించడం కలకలం రేపింది. బ్యారేజీ బీ-బ్లాక్‌లో 19, 20, 21వ పిల్లర్ల మధ్య ఉన్న వంతెన సుమారు 30 మీటర్ల పొడవున.. ఒక ఫీటు వరకు కిందికి కుంగింది. వంతెన కింద ఉన్న బ్యారేజీ పిల్లర్లు భూమిలోకి కుంగడం వల్ల వంతెన కూడా కుంగిందా? లేక బ్యారేజీ గేట్లు, వంతెన మధ్య ఉండే సిమెంట్, ఐరన్ బీమ్‌ల మధ్య ఏదైనా లోపం వల్ల కుంగిందా? అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో మూడు గంటల పాటు బ్రిడ్జి దాటేందుకు ప్రజలను పోలీసులు ప్రయాణికులను అనుమతించ లేదు.