రేవంత్ రెడ్డి సీఎం...డీకే ఓకేనా...?
తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త సీఎం అవుతారా. ఇది ఇపుడు చర్చకు తావిస్తోంది.
By: Tupaki Desk | 29 Oct 2023 4:01 AM GMTతెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త సీఎం అవుతారా. ఇది ఇపుడు చర్చకు తావిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ కి తెలంగాణాలో అనుకూల పవనాలు వీస్తున్నాయి. గ్రాఫ్ బాగా పెరిగింది. గాలి మళ్ళింది హస్తం పార్టీ వైపు అని ఒక్కటే సర్వేలు ఊదరగొడుతున్నాయి. ఈ నేపధ్యంలో కాబోయే సీఎం మా రేవంత్ అన్నా అని అభిమానులు అయితే గట్టిగా చెబుతున్నారు.
ఇక ఫైర్ బ్రాండ్ అయిన కొండా సురేఖ అయితే రేవంత్ సీఎం తాను మంత్రి అంటూ ఒక లెవెల్ లో స్టేట్మెంట్ ఇచ్చి పడేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కర్నాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం అయిన డీకే శివకుమార్ సమక్షంలోనే కాంగ్రెస్ అభిమానులు నాయకులు రేవంత్ రెడ్డి సీఎం అని గట్టిగా నినదించడం ఏ రకమైన సంకేతంగా భావించాలి అన్నదే ప్రశ్నగా ఉంది.
విషయానికి వస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తాండూర్, పరిగిలలో జరిగిన బస్సు యాత్రలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఒక వైపు ఆయన మాట్లాడుతూండగానే సీఎం రేవంత్ అని నినదించారు నాయకులు. మరి కొందరు అయితే డేట్ టైం ఫిక్స్ చేసి మరీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని గట్టిగానే చాటారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్నీ ప్రమాణ స్వీకారం రోజే తమ పార్టీ అమలులోకి తెస్తుంది అని డీకే తన స్పీచ్ లో చెబితే దానికి మసాలా జోడించి అనువదించిన కాంగ్రెస్ స్థానిక నాయకులు రేవంత్ రెడ్డి సీఎం అవుతారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అమలు చేస్తారు అని చెప్పేశారు.
దాంతో డీకే సభలోనే రేవంత్ సీఎం అన్నది అధికారిక ముద్ర పడినట్లు అయింది. ఇదిలా ఉంటే తెలంగాణాలో ఈసారి కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అన్న దాని మీద కాంగ్రెస్ లో కూడా ఉత్సాహపూరితమైన వాతావరణం కనిపిస్తోంది. చాలా మంది సీనియర్లు సీఎం పోస్టు మీద ఆశలు పెట్టుకున్నారు. వారిలో ఎన్నికల్లో పోటీ చేయని కుందుర్తి జానారెడ్డి నుంచి వీ హనుమంతరావు తో మొదలుపెడితే ఉత్తం కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కీ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి వంటి వారు ఉన్నారు. ఇక జగ్గారెడ్డి వంటి వారు అయితే పదేళ్ళ టైం లో ఎపుడైనా తానే సీఎం అని లాంగ్ టెర్మ్ టార్గెట్ పెట్టేసారు.
ఇలా కాంగ్రెస్ నుంచి సీఎం ల లిస్ట్ పెరిగిపోతోంది. మరి రేవంత్ రెడ్డికి చాన్స్ ఇస్తారా అన్నది పెద్ద డౌట్. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకనే కాంగ్రెస్ కి ఊపు వచ్చింది అన్నది వాస్తవం. రేవంత్ రెడ్డి మంచి మాటకారి, అధికార బీయారెస్ మీద ఒక స్థాయిలో విరుచుకుని పడే నేచర్ ఆయన సొంతం. కాంగ్రెస్ లో యూత్ ని చేర్చి న్యూట్రల్ పీపుల్ ని ఆకట్టుకున్న ఘనత రేవంత్ దే అని చెబుతారు.
న్యాయంగా చూస్తే పీసీసీ చీఫ్ గా ఎవరు ఉంటారో వారే సీఎం అవుతారు. మరి రేవంత్ రెడ్డి పడిన కష్టానికి ఆయనకు సీఎం పదవి దక్కుతుందా లేదా అన్నది చూడాలి. కాంగ్రెస్ హై కమాండ్ ఏమి ఆలోచిస్తోంది అన్నది కూడా ఆలోచించాలి. అయితే కాంగ్రెస్ టికెట్లు దక్కిన వారిలో అత్యధికులు రేవంత్ సపోర్టర్స్ అని టాక్ అయితే నడుస్తోంది. అన్నీ అనుకూలిస్తే రేవంత్ కొత్త చీఫ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.