Begin typing your search above and press return to search.

రేవంత్ నెత్తిన పాలు పోసిన చంద్రబాబు...!

చంద్రబాబు రాజకీయ చాణక్యం మరో మారు తేటతెల్లమైంది. జైలులో ఉన్నా ఆయన వ్యూహాలో పదును ఎక్కడా తగ్గలేదని రుజువు అయింది.

By:  Tupaki Desk   |   29 Oct 2023 11:43 AM GMT
రేవంత్ నెత్తిన పాలు పోసిన చంద్రబాబు...!
X

చంద్రబాబు రాజకీయ చాణక్యం మరో మారు తేటతెల్లమైంది. జైలులో ఉన్నా ఆయన వ్యూహాలో పదును ఎక్కడా తగ్గలేదని రుజువు అయింది. తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ తీసుకున్న నిర్ణయం వెనక అనేక కారణాలు ఉన్నాయని అంటున్నరు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. ఇక చంద్రబాబు అరెస్ట్ మీద ఏపీ కంటే హైదరాబాద్ లోనే పెద్ద ఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి.

దాంతో పాటు సెటిలర్స్, వారిలో కూడా బలమైన సామాజికవర్గం సైతం బాబు అరెస్ట్ మీద భగ్గుమంటోంది. వారికి ఇపుడు తన సత్తా చాటడానికి తెలంగాణా ఎన్నికలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజానికి అంధ్రా సెటిలర్స్ గత రెండు ఎన్నికలలోనూ బీయారెస్ వైపే మొగ్గు చూపారు. కానీ బీయారెస్ వైసీపీల మధ్య తెలియని బంధం ఉందని అనుమానాలు ఉన్న క్రమంలో కేటీయార్ స్వయంగా హైదరాబాద్ లో ఆందోళనలు వద్దు ఏపీలో చేసుకోండి అని స్టేట్మెంట్ ఇవ్వడంతో వారిలో ఆగ్రహం పెల్లుబుకింది అని అంటున్నారు.

ఆ తరువాత ఎవరికి వారు బీయారెస్ లో రిపేర్లు మొదలెట్టినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో మూకుమ్మడిగా ఒక బలమైన సామాజిక వర్గం కాంగ్రెస్ కి బలపరచనుందని అంటున్నారు. మధ్యలో టీడీపీ పోటీ చేస్తే కనుక ఓట్ల చీలిక తప్పదని, ఫలితంగా బీయారెస్ కి అది అంతిమంగా లాభం చేకూరుస్తుందని కూడా లెక్కలు వేసి మరీ టీడీపీ అనుకూల మీడియా చాలా కాలం క్రితమే దిశా నిర్దేశం చేసింది.

చివరికి అదే జరిగింది. తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పాటీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ఎంతలా పట్టుబట్టినా చంద్రబాబు అయితే నో చెప్పారనే అంటున్నారు. అది బాబు తెలివితో అన్నీ ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పోటీ చేసినా పెద్దగా ఉపయోగం అయితే ఉండదు అని అంటున్నారు.

కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉంది. పైగా చంద్రబాబు జైలులో ఉన్నారు. అర్ధ బలం అంగబలం అన్నీ చూసుకోవాలి. ప్రచారం గట్టిగా నిర్వహించాలి. అసలు అభ్యర్థుల సెలక్షనే లేదు, దాంతో అతి తక్కువ టైం లో ఇంత కసరత్తు చేసే మెకానిజం కూడా టీడీపీ వద్ద లేదు అని అంటున్నారు. లోకేష్ ఏపీకే పరిమితం అయ్యేలా చూస్తున్నారు ఆయన్ని అక్కడ ప్రొజెక్ట్ చేయలేరు. అదే టైం లో బాలయ్య వంటి వారు ఉన్నా ప్రచారం పెద్దగా ఊపందుకుంటుందా అన్న డౌట్లు ఉన్నాయి.

వీటికి మించి ఒకవేళ పోటీ చేసినా గెలుపు చాన్సులు లేక ఆ ప్రభావం ఏపీలో జరిగే ఎన్నికల మీద కూడా పడతాయి. ఇక ఏపీలో బీజేపీతో జత కట్టాలని టీడీపీ చూస్తున్న క్రమంలో తెలంగాణాలో ఎదురు నిలిచి పోటీ పడడం కూడా భావ్యం కాదని భావించే ఇలా చేశారని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కనుక తెలంగాణాలో గెలిస్తే తమకు ఎంతో కొంత అనుకూలంగా ఉంటుందన్న ఆశలు కూడా ఉన్నాయని అంటున్నారు.

ఇక రేవంత్ రెడ్డి కనుక సీఎం అయితే టీడీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇపుడు చంద్రబాబు తెలివైన నిర్ణయమే తీసుకున్నారని అంటున్నారు. ఆయన డెసిషన్ తో బీయారెస్ మరింత ఇరుకున పడింది అని అంటున్నారు. ఓట్ల చీలిక ఎపుడూ అధికార పక్షానికి కలసివస్తుంది. అలా కాకుండా పోటీ గట్టిగా జరిగితే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి. అలా రేవంత్ రెడ్డి నెత్తిన చంద్రబాబు పాలు పోశారని అంటున్నారు. ఒకనాటి తన శిష్యుడి రాజకీయ పరమ పధ సోపానానికి బాబు దీవెనలు అందించారని కూడా అంటున్నారు. ఆ మీదట రేవంత్ కష్టం, ప్రజల తీర్పును బట్టి తేలుతుందని అంటున్నారు.