రేవంత్ రెడ్డి కి రెండు... హై కమాండ్ ఫోకస్ ఏంటి...?
తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని పలు సర్వేలు చెబుతున్నాయి.
By: Tupaki Desk | 5 Nov 2023 11:30 AM GMTతెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని పలు సర్వేలు చెబుతున్నాయి. అదే విధంగా కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ లో ఎన్నడూ లేని సందడి నెలకొంది. సీనియర్ నేతలు అంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి బిగ్ సౌండ్ చేస్తున్నారు. సీనియర్ మోస్ట్ నేత వీ హనుమంతరావు అయితే తన ఏడున్నర పదుల జీవితాన్ని ఆత్మకధగా రాస్తున్నారు.
దాని ద్వారా ఆయన చెప్పదలచుకున్నది ఏదైనా ఇపుడు కాంగ్రెస్ కి అధికారం అవకాశం ఉన్న టైంలో తాను కాంగ్రెస్ లీడర్ గా దశాబ్దాల పాటు సేవ చేశాను అని చెప్పడమే అంటున్నారు. ఇక జానారెడ్డి పోటీలోనే లేరు. అయినా నాకూ సీఎం చాన్స్ వస్తుంది అని అంటున్నారు. వరసబెట్టి చెప్పుకుంటే ఉత్తం కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, భట్టి విక్రమార్క వంటి వారు ఉన్నారు.
అయితే నాచురల్ గా పీసీసీ చీఫ్ లో ఎవరు ఉన్నారో వారే సీఎం అవుతారు. ఒక్కోసారి మాత్రం సీఎల్పీ లీడర్ కి చాన్స్ ఉంటుంది. కర్నాటకలో అదే జరిగింది. 2004లో ఏపీలో కూడా అదే జరిగింది. సీఎల్పీ లీడర్ గా ఉన్న వైఎస్సార్ సీఎం అయ్యారు. ఇక ఇపుడు చూస్తే సీఎల్పీ లీడర్ గా భట్టి విక్రమార్క ఉన్నారు. పైగా ఆయన బడుగు బలహీన వర్గాలకు చెందిన వరు కావడం వల్ల కూడా ఆప్షన్లు ఉంటాయని అంటున్నారు.
ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి సీఎం అవుతారా అంటే ఆయన అభిమానులు అనుచరులు ఫస్ట్ ప్రయారిటీ ఆయనే అని అంటున్నారు. మరి హై కమాండ్ అభిప్రాయం ఎలా ఉంది అన్నది అంటే అది ఎన్నికల తరువాతనే తెలుస్తుంది అని అంటారు. కానీ ఇపుడు ఎన్నికల కంటే ముందుగానే హై కమాండ్ రేవంత్ రెడ్డి మీద తన అభిప్రాయాన్ని బయటపెట్టింది అని అంటున్నారు.
అదెలా అంటే రేవంత్ రెడ్డి సొంత నియోజకవరం కొడంగల్. ఆయన అక్కడ నుంచే పోటీ చేస్తున్నారు. కానీ తాజాగా ఢిల్లీ నుంచి వస్తున్న కబురు ఏంటి అంటే రేవంత్ రెడ్డిని కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయమని. అంటే రేవంత్ రెడ్డి రెండు సీట్లలో పోటీ చేస్తారు అన్న మాట. అవతల వైపు రెండు సీట్లలో కేసీయార్ పోటీకి దిగుతున్నారు. ఆయన సిట్టింగ్ సీఎం.
మరి కాంగ్రెస్ నుంచి రెండు సీట్లలో పోటీ అంటే రేవంత్ రెడ్డి కూడా కేసీయార్ కి ధీటైన నాయకుడు అని ప్రోజెక్ట్ చేయడమేనా అన్న చర్చ సాగుతోంది. ఇక స్టేట్ ఫిగర్ గా ఉండకపోతే రెండు చోట్ల పోటీ చేసే చాన్స్ రాదు. రేవంత్ రెడ్డి స్టేట్ బిగ్ ఫిగర్ కాబట్టే ఆయన ఎక్కడ పోటీ చేసినా జనాల్లో రెస్పాన్స్ బాగా ఉంటుందని కాబట్టే కామారెడ్డికి ఆయన్నే పంపుతున్నారా అన్నది కూడా చర్చగా ఉంది.
ఏది ఏమైనా రేవంత్ రెడ్డి రెండు సీట్లకు పోటీ చేయడం అది కూడా కేసీయార్ ని ఢీ కొట్టడం అంటే మాత్రం అమాంతం ఆయన ఇమేజ్ కాంగ్రెస్ లోనూ జనంలోనూ రెట్టింపు అవుతుంది అన్నది నిజం అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డిని ఏరి కోరి రెండు సీట్లలో పోటీకి దించి కేసీయార్ మీద సవాల్ చేయించేలా చేస్తున్న కాంగ్రెస్ హై కమాండ్ రేపటి రోజున తమ పార్టీ గెలిస్తే తప్పకుండా రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అంటే రేవంత్ రెడ్డి కి సీఎం చాన్స్ అన్నది అత్యంత పదిలంగా ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.