కేసీఆర్ సెంటిమెంట్ ను రేవంత్ ఫాలో అవుతున్నారా?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలపై అదే పనిగా విరుచుకుపడే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. గులాబీ బాస్ చేతలను మాత్రం ఫాలో అవుతుంటారని చెబుతారు.
By: Tupaki Desk | 30 Sep 2023 5:26 AM GMTరాజకీయాల్లో కొన్ని అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది ఇప్పుడు చెప్పే అంశం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలపై అదే పనిగా విరుచుకుపడే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. గులాబీ బాస్ చేతలను మాత్రం ఫాలో అవుతుంటారని చెబుతారు. మాటల్లో ఆయన్ను విభేదించే రేవంత్.. చేతల విషయానికి వస్తే సరికి మాత్రం.. ఆయన అనుసరించే కొన్ని నమ్మకాల్ని రేవంత్ కూడా ఫాలో అవుతారని చెబుతున్నారు.
కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ.. ఆయన నివాసంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న చండీయాగం తాజాగా పూర్తి అయ్యింది. ఈ యాగాన్ని పూర్తి చేసేందుకు తనకు సహకారాన్ని అందించిన వారందరికి రేవంత్ థ్యాంక్స్ చెబుతున్నారు. తెలంగాణలో ప్రజారంజకమైన పాలన రావటానికి వీలుగా ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణకు చెందిన కొందరు నేతలు అదే పనిగా యాగాల్ని చేయిస్తున్నారు. మొన్నటికి మొన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అతిరుద్ర మహాయాగాన్ని నిర్వహించగా.. ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ సైతం చండీయాగాన్ని నిర్వహించారు. కీలకమైన ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. రేవంత్ సైతం చండీయాగాన్ని నిర్వహిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.
ఇదే యాగాన్నినిర్వహించిన తర్వాతే కేసీఆర్ ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. ఇప్పుడు రేవంత్ కూడా అదే యాగాన్నినిర్వహిస్తున్న వేళ.. సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ.. చండీయాగ ప్రభావంతో లెక్కలు మారితే మాత్రం.. రానున్న రోజుల్లో ఈ యాగానికి డిమాండ్ భారీగా పెరుగుతుందని మాత్రం చెప్పక తప్పదు.