Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ లోనే సగం జీవితం... టాప్ సిటీస్ ఇవే!

ఈ సమయంలో ప్రపంచంలోని నగరాల్లోని ట్రాఫిక్ జామ్ లపై "టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2022" అనే సంస్థ తాజాగా నివేదికను విడుదల చేసింది

By:  Tupaki Desk   |   20 Sep 2023 5:30 PM GMT
ట్రాఫిక్ లోనే సగం జీవితం... టాప్ సిటీస్ ఇవే!
X

ట్రాఫిక్... ఈ పేరు చెబితే ముఖ్యంగా నగరాల్లోని జనం అల్లల్లాడిపోతుంటారు. మెడిటేషన్ చేసే వారికి కూడా ఇరిటేషన్ తెప్పించగల శక్తి ఈ ట్రాఫిక్ జామ్ లకు సొంతం అని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ట్రాఫిక్ లో గంటలు గంటల సమయంలో సైలెన్సర్ల నుంచి వచ్చే పొగలో కలిసిపోయిన సందర్భాలు ఎన్నో.. ఎన్నెన్నో..!

ఈ సమయంలో ప్రపంచంలోని నగరాల్లోని ట్రాఫిక్ జామ్ లపై "టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2022" అనే సంస్థ తాజాగా నివేదికను విడుదల చేసింది. ఇందులో భాగంగా... 56 దేశాల్లోని 390 నగరాల్లో మెట్రోపాలిటిన్ ప్రాంతంలోని డ్రైవర్ల నుంచి సేకరించిన "ట్రిప్ డేటా" ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక పరిశీలిస్తే... ట్రాఫిక్ జామ్ లోనే సగం జీవితం అయిపోతుందా అని ఆశ్చర్యం కలుగకమానక పోవచ్చు!

అవును... "టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2022" విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలోని అత్యధిక ట్రాఫిక్ జామ్ కలిగి ఉన్న నగరంగా బ్రిటన్ దేశంలోని లండన్ నగరం నిలిచింది. టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ లో ఇది ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఈ నగరంలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు సగటున 36 నిమిషాల 20 సెకన్లు పడుతున్నట్టు నివేదిక పేర్కొంది.

అంటే ఏడాదికి 325 గంటల జీవితం ట్రాఫిక్‌ లోనే గడచిపోతోందన్నమాట. ఈ ట్రాఫిక్ జామ్ ల వల్ల సమయమే కాదు ఇంధన వినియోగం కూడా భారీగా పెరుగుతుంది. ఫలితంగా డబ్బు కూడా చాలా వేస్ట్ అవుతుంది. ఇక లండన్ అనంతరం బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో ఇండియాలోని సిటీలు ఉండటం గమనార్హం!

లండన్ తరువాత ట్రాఫిక్ జామ్ అధికంగా ఉండే నగరాల్లో భారత్ కు చెందిన నగరం చోటు సంపాదించుకుంది. ఇందులో భాగంగా... ట్రాఫిక్ అధికంగా ఉంటే ప్రాంతాల్లో కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 29 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతోంది. ఇక బెంగుళూరుతో పాటు టాప్ 10 లో చోటు దక్కించుకున్న మరో ఇండియన్ సిటీ... పూణె!

టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2022 నివేధిక ప్రకారం... పూణెలో 10 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి 27 నిమిషాల 20 సెకన్లు పడుతోందట. దీంతో ఈ జాబితాలో పూణే నగరం ఆరోస్థానంలో నిలిచింది.

ఈ నివేధిక ప్రకారం టాప్ 10 దేశాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం!

1) లండన్ (యూకే)

2) బెంగళూరు (ఇండియా)

3) డుబ్లిన్ (ఐర్లాండ్)

4) సప్పోరో (జపాన్)

5) మిలాన్ (ఇటలీ)

6) పూణె (ఇండియా)

7) బుచారెస్ట్ (రొమానియా)

8) లిమా (పెరు)

9) మనిలా (ఫిలిప్పిన్స్)

10) బొగాటా (కొలంబియా)