ఒకే బైక్ మీద 155 ట్రాఫిక్ చలానాలు.. బైకర్ కు షాకిచ్చిన అధికారులు
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పుడూ.. నిత్యం ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసే అతగాడికి తగిన శాస్తి చేశారు కేరళ పోలీసులు.
By: Tupaki Desk | 11 Nov 2023 5:09 AM GMTఒకటి కాదు రెండు కాదు.. ఒక బైక్ మీద 155 ట్రాఫిక్ చలానాలు విధించిన ఉదంతం ఒకటి వెలుగు చూసింది. దీనికి గురించి తెలిసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పుడూ.. నిత్యం ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేసే అతగాడికి తగిన శాస్తి చేశారు కేరళ పోలీసులు. అదే పనిగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటంతో పాటు.. పోలీసు కెమేరాల ముందు విచిత్రమైన చేష్టలకు పాల్పడే వాహనదారుడికి దిమ్మ తిరిగే షాకిచ్చారు. ఫైన్ తో పాటు అతడి డ్రైవింగ్ లైసెన్సును ఏడాది పాటు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన పాతికేళ్ల యువకుడు ఒకడు నిత్యం రోడ్ల మీదకు బైక్ మీదకు రావటం.. ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ చేసేవాడు. అతడి చేష్టల్ని చూస్తే.. కావాలనే చేస్తున్న వైనం కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా సిగ్నల్ జంప్ చేయటం.. ర్యాష్ డ్రైవింగ్.. రాంగ్ రూట్ లో ప్రయాణించటం లాంటివి ఒక ఎత్తు అయితే.. కెమేరాల ముందు వికృత చేష్టలకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తించారు.
అతడికి పెద్ద ఎత్తున చలానాలు విధిస్తూ నిర్ణయం తీసుకోవటంతో పాటు.. అతడ్ని జరిమానా చెల్లించాలని ఎన్ని మొయిల్స్ పంపినా పట్టించుకోని పరిస్థితి. దీంతో.. విసిగిపోయిన కేరళ రాష్ట్ర రవాణా శాఖ అధికారుతు తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నారు. అతడి బైక్ మీద ఉన్న 155చలానాలకు కలిపి రూ.86వేల ఫైన్ గా డిసైడ్ చేయటంతో పాటు.. అతడి డ్రైవింగ్ లైసెన్సును ఏడాది పాటు రద్దు చేస్తూ షాకిచ్చారు. తనకు అందిన చలానాలపై సదరు యవకుడు మాత్రం తన బైక్ అమ్మినా అన్నిడబ్బులు రావని పేర్కొనటం గమనార్హం. మరోవైపు అతడి బలుపు చేష్టల్ని పలువురు తప్పు పడుతున్నారు. అతగాడి అతికి అధికారులు తగిన శాస్తి చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.