గోవాలో ఘోరం... పర్యాటకురాలు, ఇన్ స్ట్రక్టర్ కు ఏమైంది..?
గోవాలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సుమారు వంద డుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోయారు ఓ పర్యాటకురాలు, ఆమె ఇన్ స్ట్రక్టర్. దీంతో... వారిరువురూ మృతి చెందారు.
By: Tupaki Desk | 19 Jan 2025 8:04 AM GMTఏదైనా ఒక కార్యక్రమం చట్ట విరుద్ధంగా నడుస్తున్నప్పటికీ చాలా సందర్భాల్లో అది ఎందుకో అధికారుల దృష్టికి వెళ్లదు! అయితే.. ఆ చట్ట విరుద్ధ కార్యక్రమం వల్ల ప్రాణం పోయిన తర్వాత ఆ విషయం వెలుగులోకి వస్తుంది.. అప్పుడు అధికారులు రంగంలోకి దిగుతుంటారు. ఇక్కడ ప్రాణాలపై ఉన్న నిర్లక్ష్యం, విలువ ఒకేసారి తెరపైకి వస్తుంటాయని అంటుంటారు.
ఆ సంగతి అలా ఉంటే... తాజాగా చట్టవిరుద్ధంగా గోవాలో జరుగుతున్న పారాగ్లైడింగ్ వల్ల ఘోరం జరిగిపోయింది. తాజాగా జరిగిన ఘటనలో ప్రమాదవశాత్తు ఓ మహిళా టూరిస్టుతో పాటు ఆమె ఇన్ స్ట్రక్టర్ మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర గోవాలో చోటు చేసుకోగా.. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి నేరుగా లోయలో పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు చెబుతున్నారు.
అవును... గోవాలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు సుమారు వంద డుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోయారు ఓ పర్యాటకురాలు, ఆమె ఇన్ స్ట్రక్టర్. దీంతో... వారిరువురూ మృతి చెందారు. తాజాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన మహిళా పర్యాటకురాలు (27) శనివారం సాయంత్రం గోవాకు వెళ్లారు.
ఇక్కడ కేరి గ్రామంలోని సుమల్ నేపాలీ (26) అనే ఇన్ స్ట్రక్టర్ సహాయంతో పారాగ్లైడింగ్ చేయాలని నిర్ణయించుకుని వెళ్లారు. ఈ క్రమంలో వీరిరువురూ సుమారు 100 అడుగుల ఎత్తుకు చేరుకున్న అనంతరం పట్టుతప్పి నేరుగా లోయలో పడిపోయారు. దీంతో... ఇద్దరూ అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... ఈ పారాగ్లైడింగ్ ను అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలో... ఆ సంస్థ యజమాని శేఖర్ రైజాదాపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోనూ 24 గంటల వ్యవధిలో రెండు వేర్వేరు పారాగ్లైడింగ్ ప్రమాదాలు జరగగా.. ఈ ప్రమాదాల్లో ఇద్దరు పర్యాటకులు మరణించారు. ఇవి శుక్రవారం నాడు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా, కులు జిల్లాల్లో జరిగాయి. మృతుల్లో ఒకరు తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా.. మరొకరు గుజరాత్ కు చెందిన వ్యక్తి అని చెబుతున్నారు.