Begin typing your search above and press return to search.

ట్రాయ్ తాజా ప్లానింగ్.. వాడని ఫోన్ నంబర్లకు ఫైన్?

కొత్త ఆలోచనల్ని చేస్తోంది టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్. రివిజన్ ఆఫ్ నేషనల్ నంబరింగ్ ప్లాన్ పేరుతో ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది.

By:  Tupaki Desk   |   14 Jun 2024 4:30 AM GMT
ట్రాయ్ తాజా ప్లానింగ్.. వాడని ఫోన్ నంబర్లకు ఫైన్?
X

కొత్త ఆలోచనల్ని చేస్తోంది టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్. రివిజన్ ఆఫ్ నేషనల్ నంబరింగ్ ప్లాన్ పేరుతో ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న అంశాలు ప్రతి ఒక్కరి మీదా ప్రభావాన్ని చూపేలా ఉండటంతో ఈ పేపర్ లోని అంశాలపై ఇప్పుడు చర్చ మొదైలంది. తాము అనుకున్న అంశాలపై వివిధ వర్గాల అభిప్రాయాల్ని తీసుకొని తదనంతరం అందుకు తగ్గట్లు చర్యలు తీసుకునే వీలుందని చెబుతున్నారు. ఫోన్ నంబర్లను విలువైన ప్రజావనరులుగా భావిస్తూ.. వాటి కేటాయింపునకు ఛార్జీ విధించాలని ట్రాయ్ యోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. టెలికాం ఆపరేటర్ల నుంచి ఈ రుసుములు వసూలు చేయాలన్నది ట్రాయ్ ప్లానింగ్.

ఈ విధానంలో టెలికాం ఆపరేటర్ల నుంచి వసూలు చేసే రుసుములు అంతిమంగా వినియోగదారులకు బదిలీ అయ్యే వీలుంది. అదే జరిగితే.. మరింత భారం పడుతుందన్న మాట వినిపిస్తోంది. ఒక నంబరుకు ఒకేసారి లేదంటే ప్రతి ఏడాది అంటే ఒక నిర్దిష్ట కాల వ్యవధికి కొంత మొత్తాన్ని ఛార్జీగా వసూలు చేయాలన్న ఆలోచనలో ట్రాయ్ ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. వినియోగంలో లేని నంబర్లను అట్టే పెట్టి ఉంచుకున్నటెలికాం సంస్థలపైనా ఫైన్ విదించాలని భావిస్తున్నట్లుగా సదరు పత్రంలో పేర్కొన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ లో రెండు సిమ్ కార్డులు వాడటం మామూలైంది. అందులో ఒక సిమ్ కార్డును అలంకార ప్రాయంగా.. మరో సిమ్ కార్డును వినియోగిస్తున్న వైనం తెలిసిందే. వినియోగదారుల నంబర్లను కాపాడుకోవటంకోసం సదరు నంబర్లను రద్దు చేటయలేదు. ఇలాంటి వాటిని గుర్తించి ఆపరేటర్లకు ఫైన్ విధించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. సిమ్ కార్డు నంబరుకు ఛార్జి వసూలు చేయాలని ట్రాయ్ డిసైడ్ చేస్తే.. టెలికాం ఆపరేటర్ల మీద భారం పడుతుంది. దాన్ని వినియోగదారులపైన బదిలీ చేస్తుంది. లేదంటే.. వినియోగదారుల్ని పోస్టు పెయిడ్ ప్లాన్లకు మారాలని ఒత్తిడి చేయొచ్చు. అదే జరిగితే.. వినియోగదారుల నుంచి పొందే ఆదాయం కంపెనీలకు పెరిగే వీలుంది.

ఇక్కడ గుర్తించాల్సిన అంశం ఏమంటే.. స్పెక్ట్రమ్ తరహాలో ఫోన్ నంబర్లకు సంబంధించిన యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయి. వాటి వినియోగ హక్కు టెలికాం సంస్థలకు ఇస్తున్నారు. గత డిసెంబరులో వచ్చిన కొత్త టెలికాం చట్టం కింద నంబర్లకు ఛార్జీ విధించే వీలుంది. అయినా.. నంబర్ల మీద ఛార్జీలు విధించటం ఏమిటి సిత్రంగా? అనుకోవచ్చు. కానీ.. చాలా దేశాల్లో ఇదే విదానాన్ని అమలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా.. సింగపూర్.. బెల్జియం.. ఫిన్లాండ్.. బ్రిటన్.. గ్రీస్.. హాంకాంగ్.. బల్గేరియా.. కువైట్.. నెదర్లాండ్స్.. స్విట్జర్లాండ్.. పోలాండ్.. నైజీరియా.. దక్షిణాఫ్రియా.. డెన్మార్క్ దేశాల్లో ఆపరేటర్లకు లేదంటే వినియోగదారులకు ఛార్జీలు విధించటం కామన్. మన దేశంలోనూ అలాంటి విధానాన్నే తీసుకురావాలని భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.