పుకారుతో ప్రాణాలు పోగొట్టుకునే వారిని కాపాడిన చాయ్ వాలా
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు పలువురు కదులుతున్న రైలు నుంచి బయటకు దూకేసే ప్రయ్నతం చేశారు.
By: Tupaki Desk | 16 Jun 2024 4:54 AM GMTటీ అమ్మే ఒక వ్యక్తి పలువురు ప్రాణాలు కాపాడిన వైనమిది. తప్పుడు ప్రచారంతో ఆందోళనకు గురైన పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేసే ప్రయత్నాన్ని నిలువరించటం.. దూకేస్తున్న వాళ్లను ట్రైన్ లోపలకు లాగిన సేవ్ చేసిన వైనం వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే..
రాంచీ నుంచి బిహార్ లోని సాసారాంకు వెళుతున్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు కుమండీహ్ దగ్గరకు వచ్చేసరికి.. ట్రైన్ లో మంటలు చెలరేగినట్లుగా పుకారు పుట్టించారు. ట్రైన్ కు ఎలాంటి నిప్పు అంటుకోకున్నా.. ఎవరు పుట్టించారో తెలీదు కానీ తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు పలువురు కదులుతున్న రైలు నుంచి బయటకు దూకేసే ప్రయ్నతం చేశారు.
రాత్రి వేళ.. చీకటిగా ఉండటం.. ట్రైన్ నుంచి దూకేసిన వారు అవతల ట్రాక్ మీద అప్పుడు వచ్చిన గూడ్సు రైలు కారణంగా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదిలా ఉంటే..ఈ తప్పుడు ప్రచారాన్ని గుర్తించిన చాయ్ వాలా.. పలువురు ప్రయాణికులు రైల్లో నుంచి దూకేసే ప్రయత్నాన్ని అడ్డుకొని.. వారిని రైల్లోకి లాగేసి.. అది తప్పుడు ప్రచారంగా చెప్పుకొచ్చారు. అంతలోనే ట్రాక్ మీదకు గూడ్సు రైలు రావటంతో ప్రయాణికులకు విషయం అర్థమైంది.
ఈ ఘటనతో సదరు ట్రైన్ ను ఆపారు. తమను సేవ్ చేసిన వ్యక్తి టీ అమ్మే చాయ్ వాలాగా ప్రయాణికులు గుర్తించారు. ఈ తప్పుడు ప్రచారం కారణంగా ముగ్గురు ప్రాణాలు పోయాయి. ఈ వదంతిని ఎవరు వ్యాప్తి చేశారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. దీనికి కారణమైన వారిని గుర్తించే పనిలో పడ్డారు రైల్వే పోలీసులు. పలువురి ప్రాణాలను రక్షించిన సదరు చాయ్ వాలా గురించి పలువురు ప్రయాణికులు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే.. సదరు చాయ్ వాలా ఎవరన్నది బయటకు రాలేదు.