గిరిజన వర్శిటీతో టీడీపీ వైసీపీ చెలగాటం
ఒక ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తరువాత వచ్చిన ప్రభుత్వం కదల్చకుండా ఉంటేనే ప్రగతి నిరాటంకంగా సాగుతుంది.
By: Tupaki Desk | 22 July 2024 3:58 AM GMTఒక ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తరువాత వచ్చిన ప్రభుత్వం కదల్చకుండా ఉంటేనే ప్రగతి నిరాటంకంగా సాగుతుంది. అయితే వైసీపీ టీడీపీల రాజకీయ ఆధిపత్య పోరు వారి మధ్య ఉన్న పొలిటికల్ టగ్ ఆఫ్ వార్ కాస్తా అభివృద్ధి మీద పడుతోంది అని అంటున్నారు.
విభజన హామీలలో భాగంగా విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆనాడు జిల్లాలోని పాచిపెంట మండలంలోని ఓ గ్రామం, సాలూరు మండలం కొట్టక్కి, విజయనగరం మండలం గుంకలాం, కొత్తవలస మండలం రెల్లి గ్రామాలలో భూములను గిరిజన వర్శిటీ ఓసం చూసింది.
తీరా ఎన్నికలు దగ్గర పడడంతో ఆనాటి టిడిపి ప్రభుత్వం కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో 26 ఎకరాలను వర్శిటీ కోసం కేటాయించింది. దాని చుట్టూ ఒక ప్రహారి గోడ నిర్మించి వదిలింది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెల్లి గ్రామంలో గిరిజన వర్శిటీ ఏమిటి గిరిజనులు పూర్తిగా ఉన్న చోటనే అది రావాలని అంటూ మెంటాడ మండలం కుంటినవలస మధుర గ్రామం చినమేడపల్లి, దత్తిరాజేరు మండలం మర్రివలసలో గిరిజన వర్శిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక దానికి మరోసారి అప్పటి సీఎం జగన్ అలాగే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన చేశారు. ఈ గిరిజన వర్శిటీ నిర్మాణానికి 834 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని దానికి కేంద్రం కేటాయిస్తుందని ప్రకటించారు. కానీ కేంద్రం అయితే ప్రతీ బడ్జెట్ లోనూ కేవలం జీత భత్యాలకు అన్నట్లుగా అతి తక్కువ నిధులనే కేటాయిస్తోంది అని అంటున్నారు.
దాంతో గిరిజన వర్శిటీ ఎపుడు పూర్తి అవుతుంది అన్నది ఒక చర్చ అయితే స్థలం దగ్గరే రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు కలసి చెలగాటం ఆడి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడానికి ఒత్తిడి చేయడం లేదని అంటున్నారు. ఇక ఇపుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
దాంతో ఎస్ కోట నియోజకవర్గం కొత్తవలస మండలం రెల్లి గ్రామంలోనే తిరిగి గిరిజన వర్శిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆమె కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు వినతిపత్రం కూడా ఇచ్చారు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మొదలెట్టు అన్నట్లుగా గిరిజన వర్శిటీ కధ ఉందని అంటున్నారు.
గిరిజన వర్శిటీ విద్యార్ధులు అయితే అద్దే భవనాలలో చాలీ చాలని సదుపాయాలతో అవస్థలు పడుతున్నారు. ప్రయోగాలు చేసేందుకు పరిశోధనలు చేసేందుకు సైతం అవకాశం లేదు. కొత్త కోర్సులు మంజూరు చేసినా వర్శిటీకి ఉన్న స్థలాభావం వల్ల నడపలేని పరిస్థితి.
దాంతో ఎంత తొందరగా గిరిజన వర్శిటీని పూర్తి చేస్తే తమకు అంత మేలు అని వారు అంటున్నారు. కానీ టీడీపీ వైసీపీల మధ్య రాజకీయ పంతాలు పట్టింపుల వల్ల గిరిజన వర్శిటీని అటూ ఇటూ మారుఇస్తూ ఇంకా భూముల దగ్గరే వ్యవహారం నిలిచిపోయేలా చేస్తున్నారు. ఇదే బాగుంది అనుకుని కేంద్రం సైతం వర్శిటీ నిర్మాణానికి నిధులను సైతం కేటాయించడం లేదని అంటున్నారు. రాజకీయాలు ఎక్కడైనా ఉండవచ్చు కానీ అభివృద్ధి దగ్గర ఎలా కుదురుతుందని అంతా అంటున్నారు.