శేరిలింగంపల్లిలో ట్రిఫుల్ బెడ్రూం ఇంటి కరెంట్ బిల్ రూ.72 మాత్రమే
అంతేకాదు.. ఒక కమర్షియల్ ప్రాపర్టీకి నెలకు రూ.200 మాత్రమే కరెంట్ బిల్లు వచ్చేలా ‘జాగ్రత్త’లు తీసుకున్నారు.
By: Tupaki Desk | 22 Jan 2025 4:33 AM GMTహైదరాబాద్ మహానగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి శేరిలింగంపల్లి. విలాసవంతమైన భవనాలతో పాటు.. ఆకాశాన్ని అంటే భారీ టవర్లకు కేరాఫ్ అడ్రస్. గడిచిన పదేళ్లలో హైదరాబాద్ మహానగరంలో భారీగా డెవలప్ అయిన అతి కొద్ది ప్రాంతాల్లో శేరిలింగంపల్లి ఒకటి. ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు నడుస్తున్న ప్రాంతాల్లోనూ ఈ ప్రాంతమే ముందు ఉంటుంది. అలాంటి శేరిలింగంపల్లిలో ఒక ట్రిపుల్ బెడ్రూం ఇంటికి నెలకు వచ్చిన కరెంటు బిల్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.72 మాత్రమే.
ఈ సిత్రాన్ని విద్యుత్ అధికారులు తాజాగా గుర్తించారు. శేరిలింగంపల్లి తారానగర్ సెక్షన్ పరిధిలో పలు ఇళ్లకు తక్కువగా బిల్లులు రావటం.. స్థానికులు కొందరు చేసిన ఫిర్యాదులతో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేశారు దీంతో.. వారు ఫోకస్ చేయటం షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఇటీవల కాలంలో లింగంపల్లి.. హుడా ట్రేడ్ సెంటర్ లోని గాంధీ ఎస్టేట్ డి బ్లాక్ లో తరచూ విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుందన్న ఆరా తీసిన అధికారులకు.. అక్కడ పెద్ద ఎత్తున అక్రమ కనెక్షన్లు ఉన్నట్లుగా గుర్తించారు.
అంతేకాదు.. ఒక కమర్షియల్ ప్రాపర్టీకి నెలకు రూ.200 మాత్రమే కరెంట్ బిల్లు వచ్చేలా ‘జాగ్రత్త’లు తీసుకున్నారు. ఈ భాగోతాలపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు మెరుపు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ఒక ట్రిపుల్ బెడ్రూం ఇంటికి అతి తక్కువగా రూ.72 మాత్రమే బిల్ రావటం గమనార్హం.
మరో కమర్షియల్ ప్రాపర్టీతో పాటు మరికొన్ని ప్రాపర్టీలకు చెందిన యజమానులు విద్యుత్ చౌర్యానికి పాల్పడినట్లుగా గుర్తించారు. నిరుపేదలు కక్కుర్తి పడ్డారంటే కాస్త అర్థం చేసుకోవచ్చు. భారీ భవంతుల్లో ఉండే వారి కక్కుర్తిని ఎలా చూడాలి. యజమానులకు బుద్ధి లేదనుకుందాం. అంత పెద్ద ఇంటికి అంత తక్కువ బిల్లు వస్తున్న విషయాన్ని మీటర్ రీడింగ్ చూసే వారు పై అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.