భారత్ మీద జస్టిన్ పోరు వెనుక ఆ వ్యూహమే కారణమా?
ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు అన్న అంశాన్ని ఒక్క లైన్ లో చెప్పాలంటే.. దేశ అంతర్గత రాజకీయాలే కారణంగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 16 Oct 2024 4:51 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం లాంటి దేశంతో మరో దేశం ఎందుకు గొడవ పెట్టుకుంటుంది? అంతర్జాతీయ సరిహద్దుల పంచాయితీ కానీ.. మరో చికాకు కానీ లేనప్పుడు.. మన దేశానికి అక్కడెక్కడో సదూరాన ఉన్న కెనడా.. దాని అధినేత మనతో గొడవకు ఎందుకు దిగుతున్నాడు? ఏడాది క్రితం జరిగిన పంచాయితీని పట్టుకొని ఎందుకంతగా ప్రాకులాడుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయేలాఆయన వ్యవహారశైలికి కారణం ఏమిటి? ఏ ప్లాన్ తో ఇదంతా ఆయన చేస్తున్నట్లు? భారతదేశంలో పంచాయితీ పెట్టుకుంటే ఆయనకు వచ్చే లాభం ఏమిటి? సరైన కారణం లేకుండానే ఆంక్షల కత్తిని బయటకు తీసిన జస్టిన్ ట్రూడో బెదిరింపులకు ఎందుకు దిగుతున్నట్లు? దాని వెనుకున్న అసలు సంగతి ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు అన్న అంశాన్ని ఒక్క లైన్ లో చెప్పాలంటే.. దేశ అంతర్గత రాజకీయాలే కారణంగా చెబుతున్నారు. 2 రోజుల క్రితం కెనడా పార్లమెంటులో చోటు చేసుకున్న వ్యతిరేక పరిణామాల నుంచి తన దేశ ప్రజల చూపును పక్కకు తిప్పేలా.. తనను తాను సమర్థుడిగా చాటింపు చేసుకునేందుకే భారతదేశంతో కొత్త పంచాయితీ పెట్టుకున్నట్లుగా విశ్లేషిస్తున్నారు. అధికారం మీద పట్టు కోల్పోతుండటం.. దేశ ప్రజలతో పాటు.. సొంత పార్టీలోనూ వ్యతిరేకత.. వీటన్నింటి నుంచి తప్పించుకోవటానికి ఒక సంచలన ఘటన కెనడా ప్రధానికి అవసరం. అందుకే ఆయన కోల్డ్ స్టోరేజీలో ఉన్న నిజ్జర్ హత్య కేసును బయటకు తీసి భారతదేశం మీద నిందలు మోపే ప్రోగ్రాంకు తెర తీసినట్లుగా చెప్పాలి.
ట్రూడో రాజేసిన వివాదం వెనుక అసలు లెక్కలు ఉన్నాయని చెప్పొచ్చు. భారత ప్రభుత్వ ఏజెంట్లు కెనడా వాసులకు ప్రాణాంతకంగా మారారన్న ప్రచారం చేసుకోవటం.. అలాంటి వారి విషయంలో తానెంత కఠినంగా ఉన్నానన్న విషయాన్ని నమ్మించే ప్రోగ్రాంలో భాగంగా ఈ పంచాయితీ అంతా చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది. ట్రూడో ప్రాతినిధ్యం వహిస్తున్న లిబరల్ పార్టీ 2015లొ పవర్ లోకి వచ్చిన రెండేళ్ల నుంచే ప్రజాభిమానాన్ని కోల్పోయింది. 2017లో అగాఖాన్ సంస్థ నుంచి బహుమతుల రూపంలో ప్రయోజనాలు పొందటం.. 2019లో ఎస్ ఎన్ సీ - లవలిన్ స్కాం.. బ్లాక్ ఫేస్ వివాదం లాంటివి ట్రూడో ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. 2019 వచ్చే నాటికి ఆ పార్టీ బలం బాగా తగ్గిపోయింది.
చివరకు మిత్రపక్షాల మీద ఆధారపడి.. బండి లాగే పరిస్థితి. ఇలాంటి వేళ.. ఆర్థిక మంత్రి బిల్ తో పంచాయితీ మొదలైంది. చివరకు బిల్ తన పదవికి రాజీనామా చేశారు. 2021లో పూర్తి మెజార్టీ ఖాయమని నమ్మి ఎన్నికలకు వెళ్లి దెబ్బ తిన్నాడు ట్రూడో. పూర్తి మెజార్టీ ఖాయమని నమ్మిన దానికి భిన్నంగా మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బండి లాగిస్తున్న పరిస్థితి. ఈ ఏడాది జులైలో జరిగిన ప్రత్యేక ఎన్నికల్లో పార్టీకి బాగా పట్టున్న సీట్లలోనూ ఓడిపోవాల్సి వచ్చింది. దేశ ప్రధానిగా ట్రూడో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
ఇటీవల ఆయన నాయకత్వం మీద నిర్వహించిన పోల్స్ లో కేవలం 26 శాతం మంది మాత్రమే ఆయన్ను ప్రధానిగా చూడాలనుకుంటున్న వైనం వెలుగుచూసింది. ఈ పోల్ లో ట్రూడో కు ఎదురైన మరో షాక్ ఏమంటే.. ప్రతిపక్ష నేత కం కన్జర్వేటివ్ పార్టీ నేత పెర్రీ పోయిలీవ్రే సాధించిన (45 శాతం) ఓట్ల శాతం కంటే ఏకంగా 19 శాతం తక్కువ కావటం ట్రూడోను ఇబ్బంది పెడుతోంది. దీంతో ట్రూడో ప్రభుత్వం పతనం అంచున ఉందన్న వాదనను సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇంతకాలం ట్రూడో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న న్యూడెమోక్రటిక్ పార్టీ గత నెలలోనే తన మద్దతును ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటన చేసింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు, మూడు రోజుల క్రితం ట్రూడోకు వ్యతిరేకంగా ఆ దేశ పార్లమెంట్ లో సొంత పార్టీకి చెందిన వారే సంతకాలు సేకరణ చేపట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తున లిబరల్ పార్టీ ఎంపీలు ఇందులో పాలు పంచుకోవటం.. వచ్చే ఏడాది అక్టోబరులో జరిగే ఫెడరల్ ఎన్నికలకు ఈ సంకేతాలు ఏ మాత్రం మంచివి కావన్న విషయం సొంత పార్టీ నేతలకు అర్థమైంది. దీంతో.. అందరి చూపు తన మీద నుంచి మళ్లేందుకు వీలుగా పాత పంచాయితీని సరికొత్తగా తెర మీదకు తీసుకొచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కెనడాలో 7.70 లక్షల మంది సిక్కు ఓటర్లు ఉన్నారు. వారిలో కొద్దిమంది బలమైన వ్యక్తులు భారత్ లో వేర్పాటు వాదానికి మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి వారిని మచ్చిక చేసుకోవటానికి ట్రూడో ఖలిస్థానీ అనుకూల వైఖరికి తన మద్దతు ఇస్తున్నారు. ఇందుకోసం రెండు దేశాల మధ్యనున్న సంబంధాలు దెబ్బ తీసే పరిస్థితిని కూడా లెక్క చేయటం లేదు. ఇందుకోసం ఆయన ఇప్పటికే గీతలు దాటేశారు.2018లో మన దేశ పర్యటనకు వచ్చిన ట్రూడో.. పంజాబ్ మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్పాల్ అత్వాల్ ను కెనడా హైకమిషనర్ డిన్నర్ కు ఆహ్వానం పలకటం ఒక ఉదాహరణగా చెప్పాచ్చు.
2023 జీ20 సమావేశాల తర్వాత కెనడా సర్కారు నిజ్జర్ హత్య వివాదాన్ని షురూ చేసింది. ఫెడరల్ ఎన్నికలకు ఏడాది మాత్రమే టైం ఉన్నవేళ.. ఓటర్ల చూపు మరల్చేందుకు.. మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న ఎన్ డీపీ మద్దతును సొంతం చేసుకోవటానికి వీలుగా తాజా వివాదాన్ని తెర మీదకు తెచ్చినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది.