భారత్ కు మరో 2 విమానాల్లో పంపనున్న ట్రంప్ సర్కార్
ట్రంప్ సర్కారు తీరు మాత్రం అందుకు భిన్నంగా మారింది. త్వరలో మరో రెండు విమానాల్లో అక్రమ వలసల్ని భారత్ కు పంపేయనున్నట్లు పేర్కొన్నారు.
By: Tupaki Desk | 14 Feb 2025 4:32 AM GMTట్రంప్ రూటు సపరేటు అన్న విషయం తెలిసిందే. ఏ లెక్కకు ఆ లెక్కే అన్నట్లుగా ఆయన తీరు కనిపిస్తోంది. ఓవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న వేళలోనే.. ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను వెనక్కి పంపే కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్ వెలువడటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయాల్ని సదరు దేశ ప్రధాని పర్యటిస్తున్నప్పుడు తాత్కాలికంగా ఆపేసి.. ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవటం కనిపిస్తుంది.
ట్రంప్ సర్కారు తీరు మాత్రం అందుకు భిన్నంగా మారింది. త్వరలో మరో రెండు విమానాల్లో అక్రమ వలసల్ని భారత్ కు పంపేయనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న వచ్చే విమానంలో 170 -180 మంది.. ఆ తర్వాత మరికొంత మందిని పంపనున్నట్లుగా చెబుతున్నారు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వలసల్ని వెనక్కి పంపే కార్యక్రమాన్ని ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ముమ్మరం చేయటం తెలిసిందే.
ఇప్పటికే 104 మంది భారతీయులను ఫిబ్రవరి 5న భారత్ కు తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. అమెరికా వద్ద మరో 487 మంది భారతీయుల జాబితదా ఉందని.. వీరంతా వెనక్కి వస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. అమెరికా తీరుపై భారత్ ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయటం లేదన్నది తెలిసిందే. గడిచిన 15 ఏళ్లలో 15,756 మంది భారతీయుల్ని వెనక్కి పంపినట్లుగా పేరకొన్నారు.
ఇలా వెనక్కి పంపిన వారికి సంబంధించిన గణాంకాల్ని తాజాగా వెల్లడయ్యాయి. 2009లో భారత్ కు తిరిగి పంపిన భారతీయులు 734 ఉంటే.. 2019లో గరిష్ఠంగా 2042 మందిని పంపిన వైనాన్ని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. అక్రమ వలసదారుల్ని తీసుకొచ్చే విమానాల్ని అమ్రత్ సర్ లో దించటాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పు పడుతోంది. పంజాబ్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. బీజేపీ పాలనలో ఉన్న హర్యానా.. గుజరాత్ రాష్ట్రాల్లో వలసల్ని తీసుకొచ్చే విమానాల్ని ఎందుకు ల్యాండింగ్ చేయటం లేదు? అని ప్రశ్నిస్తున్నారు. మరి.. దీనికి మోడీ సర్కారు ఏమని బదులిస్తుందో?