ట్రంప్ గ్యాప్ ఇవ్వడం లేదు.. విదేశీయులకు మరో బిగ్ షాక్!
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు మరో బిగ్ షాక్ సిద్ధం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్!
By: Tupaki Desk | 6 Feb 2025 4:01 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం అనంతరం తమ దేశంలో ఉన్న విదేశీయులకు విడతలవారీగా భారీ షాక్ లు ఇస్తున్న డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరొకటి సిద్ధం చేశారు! దీంతో... అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు మరో ముప్పు పొంచి ఉందని అంటున్నారు. అదే... హెచ్-1బీ, ఎల్-1 వీసాల ఆటోరెన్యువల్ అంశం.
అవును... అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు మరో బిగ్ షాక్ సిద్ధం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్! ఇందులో భాగంగా... హెచ్-1బీ, ఎల్-1 వీసాలను ఆటోరెన్యువల్ చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని రద్దు చేసే విషయంలో ఓ ఆసక్తికర పరిణామం ఎదురైంది. ఈ మేరకు ఈ అవకాశాన్ని రద్దు చెయాలని ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు.
వివరాళ్లోకి వెళ్తే... హెచ్-1బీ, ఎల్-1 వీసాల గడువు గతంలో 180 రోజులు ఉండగా.. గత బైడెన్ సర్కార్ దాన్ని 540 రోజులకు పెంచింది. ఇది డొనాల్డ్ ట్రంప్ కఠిన వలసల నియంత్రణ, కఠిన వీసా నిబంధనలకు పెద్ద అడ్డంకిగా మారుతుందని తాజాగా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు వాదిస్తూ.. ఈ మేరకు బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు.
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనవరి 13, 2025న డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఫైనల్ చేసింది. ఈ నిర్ణయం భారీ సంఖ్యలో అమెరికాలో వర్క్ వీసాలపై పనిచేస్తున్న భారతీయులకు లబ్ధి చేకూర్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఇద్దరు సెనేటర్లు బైడెన్ నిర్ణయ రద్దుకు ప్రతిపాదించారు.
వాస్తవానికి దీనిపై జనవరి 31న తీర్మానం ప్రతిపాదించిన సమయంలో రిపబ్లికన్ సెనెటర్లు జాన్ కెన్నడీ, రిక్ స్కాట్ లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన 540 రోజుల గడువు నిర్ణయం ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలును దెబ్బతీస్తుంది.. ఇదే సమయంలో.. అమెరికా భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది అని కెన్నడీ అన్నారు.
ఇదే సమయంలో... అక్రమ వలసదరులు ఏళ్ల తరబడి అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు బైడెన్ నిర్ణయం సహకరిస్తుందని.. ఈ నిబంధనను రద్దు చేయకుండా ఉంచితే అక్రమ వలసదారులను గుర్తించడం కష్టమని అభిప్రాయపడ్డారు. దీంతో... త్వరలో హెచ్-1బీ, ఎల్-1 వీసాదరులకు ట్రంప్ సర్కార్ నుంచి బిగ్ షాక్ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.