ట్రంప్ తోనే పెట్టుకుంటున్న జెలెన్ స్కీ.. ఇలాగైతే కష్టమే
తాజాగా ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సహాయం నిలిపివేయాలని ఆయన సూచించడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహంతో స్పందించారు.
By: Tupaki Desk | 20 Feb 2025 4:25 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఆర్థిక పరంగా బలమైన దేశాలైన చైనా, జర్మనీ, ఫ్రాన్స్‌లపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించడం కొత్త కాదు. తాజాగా ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సహాయం నిలిపివేయాలని ఆయన సూచించడంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర ఆగ్రహంతో స్పందించారు.
- ట్రంప్ ప్రభావంతో చైనా నుంచి యూరప్ వరకు కంగారు!
ట్రంప్ మరోసారి గెలవడంతో అమెరికా విధానాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే ఆయన గట్టి నిర్ణయాలు తీసుకుంటూ చైనా సహా అనేక దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ముందుకెళ్తుండటంతో ఇతర దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాపై భారీ టారిఫ్‌లు విధించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టిపోటీ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ అదే ఒత్తిడి తీసుకొస్తుండడంతో భయంతో చైనా ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది.
-ట్రంప్‌తో నేరుగా ఢీకొంటున్న జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకునే స్థితిలో లేరు. ‘ట్రంప్ రష్యా చెబుతున్న తప్పుడు సమాచార ప్రపంచంలో జీవిస్తున్నట్లు కనిపిస్తున్నారు’ అంటూ ఆయన సెటైరికల్‌గా స్పందించారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయినప్పటికీ, అమెరికా సహాయం లేకుండా కూడా పోరాడతామని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ట్రంప్ మద్దతు నిలిపివేస్తే ఉక్రెయిన్ పరిస్థితి మరింత క్లిష్టం కావొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
- 'ట్రూత్ సోషల్' నిషేధం.. ట్రంప్ కోపానికి మరో కారణం?
ట్రంప్ సొంత కంపెనీ అయిన ‘ట్రూత్ సోషల్’ను ఇటీవల ఉక్రెయిన్ లో జెలెన్ స్కీ నిషేధించడం కూడా ఆయన కోపానికి మరో ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. తన అభిప్రాయాలను ప్రపంచానికి తెలియజేయడానికి ట్రంప్ ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ప్రధానంగా ఉపయోగించేవారు. ఇది నిషేధించడంతో ఆయనకు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టాక రష్యాతో చెలివిగా ఉంటున్నాడు. ఉక్రెయిన్ పై సీరియస్ అవుతున్నారు. యుద్ధాన్ని ముగిస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు. ట్రంప్ తీరు నచ్చని జెలెన్ స్కీ ఏకంగా ఆయన సోషల్ మీడియాను నిషేధించాడు. దీంతో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనన్న ఉత్కంఠ నెలకొంది.