Begin typing your search above and press return to search.

జన్మతః పౌరసత్వంపై తగ్గేదేలే అంటున్న ట్రంప్... నెక్స్ట్ స్టెప్ ఇదే!

ఇందులో జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం, జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

By:  Tupaki Desk   |   24 Jan 2025 5:24 AM GMT
జన్మతః పౌరసత్వంపై తగ్గేదేలే అంటున్న ట్రంప్... నెక్స్ట్  స్టెప్  ఇదే!
X

అమెరికాలో జన్మించిన వలసదారుల పిల్లల జన్మతః పౌసరత్వ హక్కును రద్దు చేయాలని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేయగా.. దానికి తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో దీనిపై పలువురు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు ట్రంప్ కు షాకిచ్చింది. దీనిపై ట్రంప్ స్పందించారు.

అవును... యూఎస్ లో జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రయత్నాన్ని సీటెల్ లోని ఫెడరల్ జడ్జి తాత్కాలికంగా అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ సమయంలో స్పందించిన న్యాయమూర్తి... "ట్రంప్ ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ను తయారు చేస్తున్నప్పుడు న్యాయవాదులు ఎక్కడ ఉన్నారు?" అని కామెంట్ చేసినట్లు చెబుతున్నారు.

ఇక, ఆదేశాలు ఇస్తున్న సమయంలో స్పందించిన సియటిల్ జిల్లా న్యాయమూర్తి జాన్ కఫ్నర్... ఈ నిర్ణయం నిస్సంకోచంగా 'రాజ్యాంగ విరుద్ధమే' అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. సుమారూ 25 నిమిషాల విచారణ అనంతరం ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి రాకుండా జడ్జి 14 రోజులు అడ్డుకున్నారు.

ఈ సమయంలో సియాటిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇందులో భాగంగా... "తాము తప్పకుండా అప్పీల్ కు వెళ్తామని" స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ ఓవల్ కార్యాలయం నుంచి క్లారిటీ వచ్చిందని అంటున్నారు. దీంతో.. ఈ విషయంపై ట్రంప్ 'తగ్గేదేలే' అన్నట్లుగా ముందుకెళ్తున్నట్లున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాగా... అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ట్రంప్ రికార్డ్ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం, జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దీంతో... ఈ నిర్ణయంపై ఐదుగురు గర్భిణీ స్త్రీలు, అనేక వలస సంఘాలతో పాటు డెమోక్రాట్ ల నేతృత్వంలోని రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదనలు వినిపించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు.

ఈ నేపథ్యంలోనే... సియటిల్ జిల్లా న్యాయమూర్తి జాన్ కఫ్నర్... ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులు 14 రోజులపాటు అమలులోకి రాకుండా అడ్డుకున్నారు! దీనిపై స్పందించిన ట్రంప్... తప్పకుండా అప్పీల్ కు వెళ్తామని స్పష్టం చేశారు.