Begin typing your search above and press return to search.

పనామా.. గ్రీన్ ల్యాండ్.. గాజా.. అన్నిటికీ స్వాధీనమే పంతమా.. ట్రంప్?

పనామా ఆధ్వర్యంలో ఉన్న పనానా కాల్వను తమకు ఇచ్చేయాలని.. డెన్మార్క్ చేతిలో ఉన్న గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ చెబుతున్న ఆయన తాజాగా గాజానూ బాగు చేస్తామంటూ పాట ఎత్తుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Feb 2025 12:30 AM GMT
పనామా.. గ్రీన్ ల్యాండ్.. గాజా.. అన్నిటికీ స్వాధీనమే పంతమా.. ట్రంప్?
X

అమెరికా అధ్యక్షుడిగా ఏం చేసినా చెల్లుతుందనుకుంటున్నారా? తన మాట ఎలాగైనా నెగ్గుతుందనుకుంటున్నారా..? ప్రదేశాలు.. దేశాలు.. వాటి సార్వభౌమత్వం గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. పనామా ఆధ్వర్యంలో ఉన్న పనానా కాల్వను తమకు ఇచ్చేయాలని.. డెన్మార్క్ చేతిలో ఉన్న గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ చెబుతున్న ఆయన తాజాగా గాజానూ బాగు చేస్తామంటూ పాట ఎత్తుకున్నారు.

గాజాను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనను గత వారం ట్రంప్‌ బయటపెట్టారు. అది కూడా ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ప్రకటన చేశారు. గాజాను ఓ వెకేషన్‌ ప్రదేశంగా (రివేరా) అభివృద్ధి చేస్తామన్నారు. నెతన్యాహు దీనిని ఓ విప్లవాత్మక ఆలోచన అని అభివర్ణించారు. హమాస్‌ మాత్రం ససేమిరా లేదని కుండబద్దలు కొట్టింది. కొనడానికి అమ్మడానికి గాజా స్థిరాస్తి కాదు.. పాలస్తీనాలో విడదీయలేని భాగం అని తేల్చిచెప్పింది. దీనికి ప్రతిగా ట్రంప్ తాజాగా తానేదో రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేసే ఆలోచనతో గాజాను తీసుకోవాలనుకోవడం లేదన్నారు. అంతేకాదు దాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని.. స్వాధీనం చేసుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గాజాను రక్షించి పునరుద్ధరిస్తామని.. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమీ చేయబోమని ప్రకటించారు. పశ్చిమాసికా (అమెరికాకు మధ్య ప్రాచ్యం)లోని ప్రజలకు ఉద్యోగాలిస్తామని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనకు ముందు యుద్ధంతో నిరాశ్రయులైన గాజన్లకు అరబ్‌ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్‌ ప్రతిపాదించారు. దీనికి ఆయా దేశాలు ఒప్పుకోలేదు. తమ మిత్రదేశాలైన ఈజిప్ట్‌, జోర్దాన్‌ లు శరణార్థులకు ఆశ్రయం ఇస్తాయని లేదంటే వారికి సాయం నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరికంచారు. ఈ నేపథ్యంలో జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తో ట్రంప్‌ భేటీ అయ్యారు.

యుద్ధం కారణంగా అనారోగ్యంతో, క్యాన్సర్‌తో బాధపడుతున్న 2 వేల మంది చిన్నారులను జోర్డాన్ తీసుకెళ్తామని అబ్దుల్లా- 2 చెప్పగా దీనిని ట్రంప్ అద్భుతం అని కొనియాడారు. నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించబోమన్నారు. ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆయన.. గాజన్లను పంపించకుండా గాజాను తిరిగి నిర్మించాలని సూచించడం గమనార్హం. మరోవైపు ట్రంప్‌ ప్రతిపాదనపై అరబ్‌ దేశాలు రియాద్‌ లో చర్చిస్తాయని పేర్కొన్నారు.

ఏది ఏమైనా.. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ బోల్డ్ ప్రకటనతో ట్రంప్ చాలా చులకన అయ్యారు. పనామా, గ్రీన్ ల్యాండ్ లకు గాజాకు అన్ని విషయాల్లోనూ చాలా తేడా ఉంది. అందుకనే గాజాపై ట్రంప్ ప్రకటన అందరికీ చిరాకు పుట్టించింది.