అమెరికా-కెనడా మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం
అగ్రరాజ్యం తమపై విధించిన సుంకాల నిర్ణయానికి ప్రతీకారంగా, ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ సవాలు విసిరారు.
By: Tupaki Desk | 12 March 2025 8:45 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , పొరుగుదేశం కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతకు దారి తీసాయి. ఇటీవల అమెరికా 25% టారిఫ్ విధించిన నేపథ్యంలో దీనికి ప్రతిగా సరిహద్దుల్లోని అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్న కెనడాలోని ఒంటారియో విద్యుత్‌పై ఎగుమతి సుంకాలను 25% పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కెనడా చర్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
- ట్రంప్ హెచ్చరిక
ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ నిర్ణయంపై ట్రంప్ మండిపడుతూ కెనడాను అతిపెద్ద సుంకాల దుర్వినియోగదారుగా అభివర్ణించారు. ‘‘కెనడాకు అమెరికా సబ్సిడీ ఇకపై అందుబాటులో ఉండదు. మాకు మీ కార్లు, కలప, విద్యుత్తు, ఇంధనం ఏవీ అవసరం లేదు. ఈ విషయం త్వరలోనే మీకు అర్థమవుతుంది’’ అని ఆయన హెచ్చరించారు. కాగా ప్రస్తుతం అమెరికా అత్యధిక ఇంధనాన్ని కెనడా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, హైడ్రో పవర్, సహజ వాయువు, ఎలక్ట్రిసిటీ పరంగా యూఎస్ పెద్ద మొత్తంలో కెనడాపై ఆధారపడి ఉంది.
-కెనడా ప్రతిస్పందన
అగ్రరాజ్యం తమపై విధించిన సుంకాల నిర్ణయానికి ప్రతీకారంగా, ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ సవాలు విసిరారు. ‘‘అమెరికా విధిస్తున్న సుంకాలకు మేము నిరసన వ్యక్తం చేయకుండా ఊరుకోము. విద్యుత్ సరఫరాపై కొత్త చర్యలు తీసుకుంటాం. ఒంటారియోతో మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్‌కు ఉన్న 100 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాం. మా ఇంధన వనరులపై అమెరికా ఎంతగా ఆధారపడిందో త్వరలోనే వారికి అర్థమవుతుంది’’ అని ఆయన హెచ్చరించారు.
ఇంతేకాదు అమెరికా పానీయాలను తమ స్టోర్లలో విక్రయించకూడదనే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామాలు కెనడా-అమెరికా వాణిజ్య సంబంధాలపై భారీ ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. వాణిజ్య యుద్ధం మరింత ముదిరే అవకాశముండటంతో, భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాల్సి ఉంది.