ఫ్రెండ్ ఫ్రెండే.. పేకాట పేకాటే.. మస్క్ కు తాజాగా ట్రంప్ పంచ్!
ఇటీవల టెస్లా తన కార్యాలయాన్ని భారత్ లో ఓపెన్ చేయటంతో పాటు..రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ను షురూ చేస్తున్న వేళ.. ట్రంప్ నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.
By: Tupaki Desk | 20 Feb 2025 6:30 AM GMTఅస్సలు మోహమాటమే లేదు. ఎవరెన్ని చెప్పినా ముందు అమెరికా ప్రయోజనాలు మాత్రమే. మిగిలిన విషయాలు ఏమైనా కానీ అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు ఉంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న వ్యాఖ్యల్ని చూస్తే రెండు తెలుగు సామెతలు ఇట్టే గుర్తుకు వస్తాయి. ఎక్కడైనా బావే కానీ వంగ తోట దగ్గర కాదన్నది ఒకటైతే.. ఫ్రెండు ఫ్రెండే.. పేకాట పేకాటే’ అన్నట్లుగా అమెరికా ప్రయోజనాల ముందు మిత్రుడు.. అతడితో తనకుంటే స్నేహం లాంటి వాటిని సైతం ట్రంప్ పట్టించుకోవట్లేదు.
తనకు అత్యంత సన్నిహితుడు.. తన దగ్గరకు తన పిల్లల్ని వెంట తీసుకొచ్చి తన ముందే భుజాల మీద ఎక్కించుకొని మీడియాతో అధికారికంగా మాట్లాడే మస్క్ ను సైతం ట్రంప్ విడిచి పెట్టటం లేదు. అమెరికా ప్రయోజనాలకు భంగం వాటిల్లే విషయాన్ని మీడియా ముందే అతనికి చురకలు వేయటం ఆసక్తికరంగా మారింది. ఇటీవల మోడీ అమెరికా పర్యటనలో భాగంగా మస్క భేటీ కావటం.. అనంతరం భారత్ లో టెస్లా ఎంట్రీ ఇచ్చే అంశంపై వేగంగా నిర్ణయాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల టెస్లా తన కార్యాలయాన్ని భారత్ లో ఓపెన్ చేయటంతో పాటు..రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ను షురూ చేస్తున్న వేళ.. ట్రంప్ నోటి నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి. భారత్ లో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయటం అన్యాయమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. మస్క్ పక్కన ఉన్న సమయంలోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరు కలిసి ఫాక్స్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా భారత్ లోకి టెస్లా ఎంట్రీ ప్రణాళికపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఈ ప్రపంచంలోని ప్రతి దేశం మమ్మల్ని వాడుకోవటానికి ప్రయత్నిస్తుంది. సుంకాలతో మా నుంచి లబ్థి పొందాలని చూస్తున్నారు. ఎలాన్ మస్క్ తన కార్లను అమ్మటం అసాధ్యంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణ భారతే. ఇప్పుడు ఆయన భారత్ లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వరకు అది మంచిదే కావొచ్చు.కానీ.. అమెరికా పరంగా అది చాలా అన్యాయమైన నిర్ణయమే. మోడీతో భేటీ సందర్భంగా విద్యుత్ కార్లపై అధిక సుంకాల విషయాన్ని ప్రస్తావించా. సుంకాల సమస్యను పరిష్కరించుకోవటంతో పాటు వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం కోసం ఇరుదేశాలు కలిసి పని చేసేలా నిర్ణయించాం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా చూసినప్పుడు అమెరికా ప్రయోజనాలకు భంగం వాటిల్లే ఏ విషయాన్ని తాను వదిలిపెట్టనన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేశారని చెప్పాలి.
ఇంతకూ మస్క్ భారత్ లో టెస్లా ఫ్యాక్టరీ పెడితే ట్రంప్ కు ఎందుకంత ఇబ్బంది అంటే.. ఈ మధ్యనే మోడీ సర్కారు కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఈవీ వాహన తయారీ సంస్థలు దేశంలో కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి.. ఇక్కడే ఫ్యాక్టరీ (ఉత్పత్తి) చేస్తే దిగుమతి సుంకాలు 15 శాతానికి తగ్గించేలా కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. అలా చేయటం ద్వారా పెట్టుబడులు భారత్ కు వస్తాయి.
అదే జరిగితే.. అమెరికా తనదేశం నుంచి కార్లను ఎగుమతి చేసే అవకాశాన్ని కోల్పోతోంది. అదే సమయంలో భారత్ నుంచి తనకు దగ్గర్లోని దేశాలకు కార్లను ఎగుమతి చేసే వీలుంది. ట్రంప్ చెప్పినట్లు.. ఈ వ్యవహారంలో భారత్.. మస్క్ లాభపడతారు కానీ.. అమెరికాకు ఏం లాభం అన్నది ఆయన ఆక్రోశం. భారతదేశం.. ప్రదానమంత్రి నరేంద్ర మోడీ తనకు మంచి స్నేహితుడు అని చెప్పే ట్రంప్.. అవన్నీ కూడా తన దేశ ప్రయోజనాలకు ఇబ్బంది కలగనంత వరకు మాత్రమేన్న విషయం తాజా ఉదంతంతో మరోసారి స్పష్టమవుతుందని చెప్పాలి.