మై డియర్ పుతిన్.. నీ చేతుల్లో రష్యా సర్వ నాశనం: ట్రంప్
ట్రంప్ వస్తే పుతిన్ తో సంభాషణలు జరుగుతాయని భావిస్తున్న వేళ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 21 Jan 2025 9:10 AM GMTఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎట్టకేలకు ఆగింది.. ఇక అందరి చూపూ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనే.. ఇప్పటికి సరిగ్గా 35 నెలలు అవుతోంది ఈ సంక్షోభం మొదలై. అయితే, ఈ రెండు యుద్ధాలను ఆపగలిగే శక్తి ఒక్కరికే ఉందని ఇంతకాలం భావించారు. ఆ వ్యక్తే డొనాల్డ్ ట్రంప్. తాను అధ్యక్షుడినైతే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని వారంలో ఆపేస్తానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభాన్ని కూడా ట్రంప్ ఆపగలరు. కారణం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ నకు ఉన్న స్నేహమే.
2016 ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో రష్యా పాత్ర ఉందని అంటారు. నాడు ట్రంప్ నకు అనుకూలంగా సాగిన ప్రచారంలో పుతిన్ కీలకంగా నిలిచారనే ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక పుతిన్ తో స్నేహ సంబంధాలను కొనసాగించారు. తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేవాడినని పేర్కొన్నారు. దీన్నిబట్టే పుతిన్ కు చెప్పే ధైర్యం ట్రంప్ నకే ఉందని స్పష్టం అవుతోంది.
పుతిన్ తప్పు చేస్తున్నావ్..
ట్రంప్ వస్తే పుతిన్ తో సంభాషణలు జరుగుతాయని భావిస్తున్న వేళ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ను తీవ్రంగా తప్పుబట్టారు. రష్యాను ఆయన నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదంతా ప్రమాణం చేసిన కొద్దిసేపటికే కావడం గమనార్హం.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ.. పుతిన్ ఒప్పందం చేసుకోవాలని.. సంధికి వెళ్లకుండా రష్యాను నాశనం చేస్తున్నారని విమర్శించారు. ఫలితంగా రష్యా పెద్ద చిక్కుల్లో పడనుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రిపోర్టర్లను ఆశ్చర్యపరిచాయి.
ఒకప్పుడు పుతిన్ ను బాగా అభిమానించారు ట్రంప్. ఆయనతో భేటీకి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు కూడా. తాను పుతిన్ ను కలుస్తానని చెప్పారు. ఉక్రెయిన్ తో పుతిన్ సంధి కోరుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ పనిని సరిగా చేయడం లేదని.. వారం రోజుల్లో ముగుస్తుందన్న యుద్ధం మూడేళ్లయిందని తప్పుబట్టారు. ద్రవ్యోల్బణం, ఇతర కారణాలతో రష్యా ఆర్థికవ్యవస్థ బాగా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు.
ట్రంప్ తో పుతిన్ భేటీ ఇంకా ఖరారు కాలేదు. అమెరికా ఈ మేరకు ఇప్పటివరకు రష్యాను కోరలేదట. అయితే, ఉక్రెయిన్ పై యుద్ధం గురించి ట్రంప్ ఫోన్ లో పుతిన్ తో మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. యుద్ధాన్ని ఇంకా విస్తరించొద్దని పుతిన్ కు ట్రంప్ సూచించినట్లు అమెరికా వర్గాలు చెప్పాయి.