Begin typing your search above and press return to search.

భారత్ ఎన్నికల్లో అమెరికా సాయం.. ట్రంప్ మరోమారు కీలక వ్యాఖ్యలు!

భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటింగ్ ను పెంచేందుకు అమెరికా చేసిన సాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Feb 2025 5:33 AM GMT
భారత్ ఎన్నికల్లో అమెరికా సాయం.. ట్రంప్ మరోమారు కీలక వ్యాఖ్యలు!
X

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అగ్రరాజ్యం అమెరికా నిధుల పాత్ర ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటరు సంఖ్యను పెంచేందుకు అందించే సాయాన్ని రద్దు చేస్తున్నట్లు ఇటీవల ఎలాన్ మస్క్ పేర్కొనడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది.

దీంతో.. భారత్ లో ఓటర్ల సంఖ్యను పెంచడానికి అమెరికా నిధులు ఇవ్వడం ఏమిటి అనే ప్రశ్న బలంగా లేవనెత్తారు నెటిజన్లు! మరోపక్క దీనిపై రాజకీయ దుమారం లేచింది. దీనికితోడు ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు స్పందించి, కీలక వ్యాఖ్యలు చేసిన ట్రంప్.. తాజాగా ఐదోసారి ఆ అంశాన్ని ప్రస్థావించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటింగ్ ను పెంచేందుకు అమెరికా చేసిన సాయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అటు బైడెన్ ను విమర్సిస్తూ.. భారత్ పైనా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ అంశాన్ని ప్రస్థావించారు. అలా ప్రస్థావించడం ఇది ఐదోసారి.

తాజాగా వాషింగ్టన్ లో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ) లో ఆయన మరోసారి ఈ విషయాన్ని ప్రస్థావించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... భారత్ ఎన్నికల కోసం రూ.182 కోట్లు సాయం చేశాం.. ఇదేమి దారుణం? ఓటర్ ఐడీ వంటి విషయాల్లో వారు మనకే సాయం చేయొచ్చు కదా? అని అన్నారు.

ఇదే సమయంలో... భారత్ లో జరిగే ఎన్నికలకు మనం డబ్బులు ఇస్తున్నాం.. వారికి అవి అవసరం లేదు.. వారు మనల్ని అవకాశంగా తీసుకుంటున్నారు అని ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలో... అమెరికాపై 200శాతం సుంకాలు విధిస్తున్నవారికి మనం భారీగా డబ్బులు ఇస్తున్నాం.. వారి ఎన్నికలకు సాయం చేస్తున్నాం.. అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇలా భారత్ ఎన్నికలకు అమెరికా సాయం అనే విషయాన్ని ట్రంప్ పదే పదే ప్రస్థావిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో... బంగ్లాకు రూ.251 కోట్లను సాయంగా అందిస్తే.. వారు ఆ నిధులతో కరుడుగట్టిన కమ్యునిస్టులకు ఓటు వేశారు అని ఆ దేశంపైనా డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు! దీంతో.. ఈ విషయం మరోసారి వైరల్ గా మారింది.

అమెరికా వెర్షన్ అలా ఉంటే... ఈ వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగుతున్న వేళ కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. ఈ సందర్భంగా వివరణ ఇచ్చింది. ఇందులో భాగంగా... యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (యూఎస్ ఎయిడ్) ద్వారా భారత్ లోని 7 ప్రాజెక్టులకు 2023-24లో రూ.6,498 కోట్ల నిధులు వచ్చాయని తెలిపింది.

అయితే... ఇవి ఎన్నికల్లో ఓటింగ్ ను పెంచడానికి మాత్రం కాదని కేంద్రం స్పష్టం చేసింది. వాస్తవానికి ఈ నిధులు భారత్ ప్రభుత్వంతో కలిసి యూఎస్ ఎయిడ్ ఈ 7 ప్రాజెక్టులపై పని చేస్తోందని వెల్లడించింది. ఎన్నికల్లో ఓటింగ్ ను పెంచడానికి ఎలాంటి నిధులు రాలేదని స్పష్టం చేసింది.