Begin typing your search above and press return to search.

'క్రిప్టో..' స్టార్ ట్రంప్.. ఒకే ఒక్క ప్రకటన.. రూ.26 లక్షల కోట్లు

అమెరికా అధ్యక్షుడిగా రెండో టర్మ్ రెండు నెలలు కూడా కాకముందే ట్రంప్ అనేక సంచనాలు రేపారు.

By:  Tupaki Desk   |   3 March 2025 4:00 PM IST
క్రిప్టో.. స్టార్ ట్రంప్.. ఒకే ఒక్క ప్రకటన.. రూ.26 లక్షల కోట్లు
X

అమెరికా అధ్యక్షుడిగా రెండో టర్మ్ రెండు నెలలు కూడా కాకముందే ట్రంప్ అనేక సంచనాలు రేపారు. రేపు అధికారం చేపడతాననగా ‘ట్రంప్ మీమ్ కాయిన్’ తో కలకలం రేపారు. జనవరి 18న నేరుగా ఆయనే విడుదల చేయడంతో కొత్త మీమ్ కాయిన్ మార్కెట్ క్యాప్ మూడు గంటల్లోనే 8 అమెరికన్ బిలియన్లకు చేరింది. అప్పుడు క్రిప్టో సమాజం నుంచి దీనిపై విపరీతమైన ఆసక్తి వ్యక్తమైంది. సందేహాలూ రేకెత్తాయి.

జనవరిలో ట్రంప్ $TRUMP పేరిట కొత్త క్రిప్టో టోకెన్‌ విడుదల చేయగా అదొక పోటీ కరెన్సీలాగా దూసుకెళ్లింది. ట్రంప్ సొంత సోషల్ మీడియా ట్రూత్ తో పాటు ఎక్స్ లోనూ సంచలనంగా మారింది.

$TRUMP అప్పట్లో రేపిన సంచలనం వెనుక ట్రంప్ పై కాల్పులతో కూడిన ఫొటోతో విడుదల చేయడమూ ఒక కారణమే. వాస్తవానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ట్రంప్‌ క్రిప్టోలను బాగా ప్రస్తావించేవారు. స్వతహాగా వ్యాపారి కావడమూ దీనికి నేపథ్యంగానూ భావించవచ్చు. ట్రంప్‌ గెలిచాక ఇంకేముంది..? క్రిప్టో కరెన్సీ బిట్‌ కాయిన్‌ ధర దూసుకెళ్లింది. అధ్యక్షుడు కాగానే.. క్రిప్టోలపై పనిచేయడానికి ఓ ప్రెసిడెన్షియల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ కూడా ఏర్పాటుచేశారు. క్రిప్టోలపై ఈ సంస్థ అవసరమైన చట్టాలు, నిబంధనలు తయారు చేయనుంది. క్రిప్టో కంపెనీలపై దర్యాప్తులు చాలావరకు నిలిచిపోవడమూ గమనార్హం.

ఇప్పుడు ట్రంప్‌ చేసిన ఒక్క ప్రకటన క్రిప్టో మార్కెట్లోకి 300 బిలియన్‌ డాలర్లను (సుమారు రూ.26 లక్షల కోట్లు) చొప్పించింది.

ట్రంప్ ఐదు క్రిప్టో కరెన్సీలను అమెరికా వ్యూహాత్మక రిజర్వులుగా ఉంచుతానని ప్రకటించారు. ఎక్స్‌ఆర్‌పీ, ఎస్‌వోఎల్‌ (సోలాన,), ఏడీఏ (కార్డనో), బిట్‌ కాయిన్‌, ఎథర్‌ లను రిజర్వులుగా ఉంచాలని ప్రెసిడెన్షియల్‌ వర్కింగ్‌ గ్రూప్‌ నకు మార్గదర్శకాలు జారీ చేశారు.. గతంలో క్రిప్టోలపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ లలో పేర్లను ప్రస్తావించలేదు. ఇప్పుడు మాత్రం నేరుగానే పేర్కొన్నారు.

అంతే.. పైన చెప్పిన ఐదు క్రిప్టో కరెన్సీల విలువ దూసుకెళ్లింది. ఇక ఎలా నిల్వ చేస్తారనేది చూడాలి ఎక్స్‌ఆర్‌పీ, ఎస్‌వోఎల్‌, ఏడీఏ విలువ 62 శాతం.. బిట్‌ కాయిన్‌, ఎథర్‌ విలువ 10 శాతంపైగా ఎగసింది. క్రిప్టో సామ్రాట్ ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటికీ బిట్‌ కాయిన్‌ ఫిబ్రవరి నెలలో విలువ కోల్పోయింది. ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో మళ్లీ రైజ్ అయింది.