వైరల్ పిక్... కొలంబియా అయినా భారతీయులైనా ట్రంప్ ట్రీట్ మెంట్ సేమ్!
ఇప్పటికే కొలంబియా, మెక్సికో వంటి దేశాలకు చెందిన అక్రమ వలసదారులను ఖైదీలుగా ట్రీట్ చేస్తూ తమ దేశానికి పంపారంటూ వారు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 Feb 2025 11:27 AM GMTఅమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రధానంగా... అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే కొలంబియా, మెక్సికో వంటి దేశాలకు చెందిన అక్రమ వలసదారులను ఖైదీలుగా ట్రీట్ చేస్తూ తమ దేశానికి పంపారంటూ వారు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈసారి అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులపై దృష్టి సారించారు ట్రంప్. ఇందులో భాగంగా.. చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపించింది. ఈ క్రమంలో 104 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సి-017.. బుధవారం మధ్యాహ్నం 1:55 గంటలకు అమృత్ సర్ విమానశ్రయంలో దిగింది.
వాస్తవానికి తొలుత 205 మంది స్వదేశానికి వస్తున్నట్లు కథనాలు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 104 అని చెబుతున్నారు. అయితే.. ఈ సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి వచ్చిన వారిలో 33 మంది గుజరాత్, 33 మంది హర్యానా, 30 మంది పంజాబ్ వాసులతో పాటు ముగ్గురు మహారాష్ట్ర, ముగ్గురు యూపీ, ఇద్దరు చండీగఢ్ వాసులు ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. వారిని భారత్ కు పంపేముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో... రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్ కు రానున్నాయని వివరించారు.
ఇక ప్రస్తుతం వచ్చినవారిలో అమృత్ సర్ వచ్చిన విమానంలో 25 మంది మహిళలు, 13 మంది పిల్లలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో వీసా గడువు ముగిసినా, సరైన పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా భారతీయులు ఎక్కడున్నా వారిని వెనక్కి రప్పించేందుకు వెసులుబాటు కల్పిస్తున్నమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ చెబుతున్నారు.
ఆ సంగతి అలా ఉంటే... అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తిరిగి భారత్ కు పంపిస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో భాగంగా... తాజాగా కనిపిస్తున్న ఫోటోల్లో అక్రమ వలసదారుల కాళ్లకు సంకెళ్లు దర్శనమిచ్చాయి. దీంతో... కొలంబియా అయినా, భారత్ అయినా.. ట్రంప్ ట్రీట్ మెంట్ సేమ్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.